ArticlesNews

ఓ హిందుత్వవాదీ… జర సోచ్ – సమఝ్ కే బాత్ కరో

908views

హిందూ దేవీ దేవతలను ఎవరైనా తూలనాడినా, హిందూ ధర్మాన్ని, హిందువులను ఎవరైనా అవమానించినా కొంతమంది హిందుత్వ వాదులు “అన్య మతస్తులను మీరు ఇలాగే అవమానించగలరా? తూలనాడగలరా? అలా అని మీరు బయట తిరగగలరా? ప్రాణాలతో ఉండగలరా?” అంటూ ఆ అన్న వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈమధ్య. అంటే దానర్థం ఏమిటి? హిందువులకంటే అన్యమతస్తులు పౌరుష పరాక్రమశాలురనా? వీరాధివీరులనా? హిందువులు చేతగాని వారనా? చేవ చచ్చిన వారనా?

ఇప్పుడు దేశంలో ఉన్న అన్యమతస్తులలో 90 శాతం పైగా మతం మారిన వారే. వారంతా గతంలో హిందువులే కదా? ఎందుకు మతం మారారు? దేశాన్ని 800 సంవత్సరాల పాటు పాలించిన తురుష్కులచేత బలవంతంగా మతం మార్చబడిన వారి వారసులే కదా వీరంతా? అంటే ప్రాణభయంతో మతం మారిన వారి సంతానం అన్నమాట. వారిలో మీకేం పౌరుష పరాక్రమాలు కనిపిస్తున్నాయి?

మరో వైపు క్రైస్తవులుగా మారిన వారు సైతం ప్రలోభాలకు లొంగిపోయి లేదా ప్రాణభయంతో మతం మారిన వారే కదా? వారిలో మనమేం తెగువను చూడగలం?

ఇక సుమారు 2 వేల సంవత్సరాల పరాధీనత, అణచివేత, వేధింపుల మధ్య కూడా మతం మారకుండా నిలచిన వారందరూ ప్రాణాలకు తెగించి పగవాడితో, పరదేశపు వాడితో పోరాటం చేసి గెలిచి నిలచిన వారే కదా? మరి వారెలా భీరువులౌతారు?

మహమ్మదీయ పాలకులను ముప్పు తిప్పలు పెట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర శివాజీ ఎవరు? ఆయన వెనక నడచిన మావళీలు, ఇతర సామాన్యులు ఎవరు? హిందువులు కాదా?

అడవులే ఆశ్రయములైనను ఆకులలములె అన్నమైనను మొఘలు పాదుష గుండెలదరగ జీవితాంతము పోరు సలపిన ఆ వీర రాణా ప్రతాప సింహుడు ఎవరు? ఆయన వెనుక నిలచిన భిల్లులు ఎవరు?

స్వధర్మరక్షణ కోసం అనేక హింసలను భరించి, ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గురు తేజ్ బహదూర్ ఎవరు? అతి పిన్న వయస్సులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా… ఒక్కొక్క ఇటుకనే పేరుస్తూ సజీవ సమాధి చేస్తూ ఉన్నా కించిత్ కూడా తొణకకుండా, బొట్టు కన్నీరు కార్చకుండా, భగవత్ భజన చేస్తూ నవ్వుతూ నవ్వుతూ తమ ప్రాణాలనర్పించిన బాలకులు ఫతే సింగ్, జొరావర్ సింగ్ లు ఎవరు?

పరాయి పాలకులకు తలొగ్గకుండా భీకర పోరాటం సలిపి 23 ఏళ్ల చిరుప్రాయంలో స్వదేశ రక్షణకోసం ప్రాణాలర్పించిన వీర ఝాన్సీ ఎవరు?

దొంగ దారిలో గుంపులుగా వస్తున్న ముష్కరుల తలలను రోకటి బండతో బాది పచ్చడి చేసి శవాల గుట్టలను పేర్చిన ఒనకే ఓబవ్వ ఎవరు?

బ్రిటిష్ నక్కలను ముప్పు తిప్పలు పెట్టి, రొమ్ము విరిచి ఎదురునిలిచి వందేమాతరమని గర్జిస్తూ దేశ మాత చరణాలకు తన ప్రాణాలను హారతిగా అర్పించిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎవరు?

ఇలా ఊరికొకడు, వీధికొకడు ఇంకా చెబితే ఇంటికొకడు వీరుడు జన్మించిన వీరుల గడ్డ, పౌరుష పరాక్రమశాలుర అడ్డా మన ఈ దేశం. అయోధ్యలో నిన్నగాక మొన్న 500 సంవత్సరాల అవమాన చిహ్నాన్ని భూస్థాపితం చేశాం కదా? అనేక అవాంతరాల మధ్య, ప్రభుత్వాల అణచివేతల మధ్య, అన్ని కష్టాలనూ అధిగమించి ఆ అవమాన చిహ్నాన్ని నేలమట్టం చేసిన ఆ 6 లక్షల మంది కరసేవకులు ఎవరు? హిందువులు కాదా?

ఇవన్నీ మరచి “వాళ్ల జోలికి వెళ్లగలరా? వాళ్ళనేమైనా అని మనగలరా?” అని మనమే ప్రశ్నిస్తున్నామంటే వాళ్ళేదో పెద్ద తోపులని, తురుములని మనమే సర్టిఫై చేస్తున్నట్టు కాదా? మనం చేతగాని వాళ్ళమని, చవట దద్దమ్మలమని మనకు మనమే బిరుదులు ప్రదానం చేసుకుంటున్నట్టు కాదా?

హిందూ సమాజానికి ప్రస్తుతం కావలసింది ముందుండి నడిపే నాయకుడు. అందరిలోనూ ఆవేదన ఉంది. ఏదో చేయాలన్న ఆకాంక్షా ఉంది. ముందుండి నడిపించే, ముందుకు ఉరికించే తెగువ గల, చేవగల నాయకుడు కావాలి. అలా ఏ వ్యక్తయినా, శక్తయినా, సంస్థ అయినా హిందూ సమాజంలో తగిన విశ్వాసాన్ని నింపి, కలిపి కదిలిస్తే హిందూ సమాజం కదనరంగాన దూకటానికి సిద్ధంగా ఉంది. హిందూ సమాజం యొక్క శక్తి ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులాంటిది. అవసరమైనప్పుడు మహోజ్వల జ్వాలగా మారి వైరి మూకలను దహించి వేస్తుంది. ఇది నిశ్చయం. సందేహమే అవసరం లేదు. అంతవరకూ హిందువులను, హిందూ సమాజాన్ని పలుచన చేసే మాటలను మనమే మాట్లాడడం మాని, హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని, అనంత చైతన్యాన్ని ప్రోది చేసే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకీ జై.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.