
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు బాధితులను ఆదుకుంటున్నారు.

మంచినీరు, ఆహార పొట్లాలు అందజేస్తూ మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు. గుడూరు బైపాస్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు గూడూరు రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారుల పిలుపు మేరకు రెండు రోజులుగా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఆదిశంకర కళాశాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువవడంతో ఉదయం నుండి ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు, ప్రయాణికులకు సాయి సత్సంగం నిలయం, సమరసత సేవా ఫౌండేషన్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్, ఆశ్రయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

240 మందికి పులిహోర, నీరు, బిస్కెట్లు, చపాతీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోట సునీల్ కుమార్, తీగల చంద్ర, పెటేటి చంద్రనీల్, శ్యాం కుమార్ రెడ్డి, సూర్య, తిలక్, హర్ష, సాయి, కోటి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, తుపాను వల్ల రైళ్ళ రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు భోజనాలు వాటర్ ప్యాకెట్లను సేవాభారతి, ఏబీవీపీ కార్యకర్తలు అందించారు.







