
-
సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశ సరిహద్దు ఆవల టిబెట్ ప్రాంతంలో భద్రత దృష్ట్యా రెండు లైన్ల రోడ్డు అవసరమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల నుంచి పొరుగున గల చైనా తమ సైన్యాన్ని భారీగా మోహరింపజేస్తోందని వివరించింది. మన సైనిక వాహనాలు సరిహద్దుల వరకూ వెళ్లేందుకు వీలుగా రెండు లైన్ల రోడ్డు సౌకర్యం ఉండాలని పేర్కొంది. దేహ్రాదూన్, మేరఠ్‌లలోని సైనిక స్థావరాలను, ఆయుధాగారాలను కలుపుతూ రిషికేశ్-గంగోత్రి, తనక్‌పుర్-పిథోర్‌గఢ్ తదితర మార్గాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం తెలిపింది.
1962 నాటి యుద్ధ పరిస్థితులు తలెత్తితే, సమర్థ పోరాట ప్రదర్శనకు ఇవి అవసరమని తెలిపింది. రెండు లైన్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఈ కేసు నిన్న విచారణకు రాగా… జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశ రక్షణతో పాటు.. పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని రహదారి నిర్మాణం చేపట్టాలంది. దేశ రక్షణ అవసరాలను విస్మరించలేమని, ఈ విషయంలో తమకు మరో అభిప్రాయమే లేదని స్పష్టం చేసింది.
Source: Eeanadu





