
-
కాంగ్రెస్‌ను తిరస్కరించిన ఓటర్లు
గౌహతి: అస్సాంలో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేపీ, దాని కూటమి భాగస్వామి యూపీపీఎల్ మొత్తం 5 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకోగా, కూటమి భాగస్వామ్య పక్షమైన యూపీపీఎల్ రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్‌ను వీడి కాషాయ పార్టీలో చేరిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. జోర్హాట్ జిల్లాలోని మారియోని నియోజకవర్గంలో బీజేపీకి మారిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రూపజ్యితి కుర్మీ భారీ మెజార్టీతో గెలుపొందారు.
గత ఆగస్టులో బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ సభ్యుడు సుశాంత బోర్గోహైన్ ఎగువ అస్సాంలోని శివసాగర్ జిల్లాలోని తౌరా నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. దిగువ అస్సాంలోని భబానీపూర్ నియోజకవర్గంలో ఇటీవల ఏఐయూడీఎఫ్ నుంచి బీజేపీలో చేరిన ఫణిధర్ తాలుక్దార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియాలో, ఉపఎన్నికల్లో బీజేపీ కూటమి భాగస్వామి యుపీపీఎల్ విజయపథంలో కొనసాగుతోంది. గోస్సైగావ్ నియోజకవర్గంలో యూపీపీఎల్ అభ్యర్థి జిరోన్ బసుమోతరీ భారీ మెజార్టీతో గెలుపొందారు.
బీటీఆర్ యూపీపీఎల్ అభ్యర్థి తాముల్‌పూర్ నియోజకవర్గంలో జలెన్ దైమరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించారు. ఇదిలావుండగా, మేఘాలయలో కూడా కాంగ్రెస్‌ను ఓటర్లు తిరస్కరించారు. బీజేపీ కూటమి భాగస్వామి, ఎన్‌పిపి అభ్యర్థి అబ్దుస్ సలేహ్, గారో హిల్స్‌లోని రాజబాలా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు.
Source: Organiser





