
గోవా: గోవాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్’ బ్యానర్లు స్వాగతం పలికాయి. మమతా అక్టోబర్ 28, గురువారం ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు స్థానికులు ‘జై శ్రీరామ్’ నినాదాలు, పోస్టర్‌లతో స్వాగతం పలికారు. 2022లో జరిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత బెనర్జీ తన తొలి పర్యటన కోసం గోవాకు వెళ్ళారు. ఆమె గోవా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదంతో స్వాగతం పలికారు. అంతేకాకుండా గోవా రాష్ట్రవ్యాప్తంగా అనేక ‘జై శ్రీరామ్’ పోస్టర్లు కూడా వెలిశాయి.
ఈ ఘటనపై గోవా మాజీ సీఎం, టీఎంసీ నేత లుయిజిన్హో ఫలేరియో మాట్లాడుతూ ‘కొందరు బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలతో నిరసన తెలిపారు… మమతా బెనర్జీ వారికి నమస్కారం చేశారు. అలా మేము ముందుకు సాగాము. నేను కూడా రామ భక్తుడిని’ అని ఆయన అన్నారు. అయితే, ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని రాష్ట్ర బీజేపీ విభాగం ఖండించింది. ‘హోర్డింగ్‌ల వ్యవహారంలో మాకు ఖచ్చితంగా సంబంధం లేదు’ అని ఒక బీజేపీ కార్యకర్త చెప్పినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
తృణమూల్ అధినేత్రి పోస్టర్లను చించేశారు…
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలి పర్యటనకు ముందు గోవాలో పలు హోర్డింగ్‌లు ధ్వంసమయ్యాయి. ఆమె చిత్రాలతో కూడిన అనేక హోర్డింగ్‌లకు కొందరు చింపేశారు. ఆ హోర్డింగ్‌లకు దగ్గరగా ‘జై శ్రీ రామ్’ పోస్టర్లు వెలిశాయి. గోవా అంతటా అనేక తృణమూల్ హోర్డింగ్‌లు, బిల్‌బోర్డ్‌లను తీసి వేశారు. చాలా బ్యానర్‌లపై మమతా బెనర్జీ ముఖంపై సిరా పూశారు. ఆ పార్టీ గోవా యూనిట్.. ఈ ఘటనకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై నిందలు వేసింది.
Source: NationalistHub





