ArticlesNews

సమైక్య భారత రూపశిల్పి సర్దార్ పటేల్

811views

1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రానే వచ్చింది. నుడిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాన మంత్రి అయ్యారు. సర్దార్ పటేల్ ఉప ప్రధాని అయ్యారు. దేశీయాంగ వ్యవహారాలు, సమాచార ప్రసారశాఖ, స్వదేశ సంస్థానాల మంత్రిత్వశాఖలు ఆయన అధీనంలోకి వచ్చాయి.

అప్పట్లో భారతదేశంలో 600 పైగా సంస్థానాలు వుండేవి. వాటిలో కొన్నింటిని మినహాయిస్తే తక్కినవన్నీ చిన్నచిన్న సంస్థానాలే. వాటిని పాలిస్తున్న మహారాజులు, నవాబుల్లో కొందరు మాత్రం వివేకవంతులుగా, దేశభక్తులుగా వుండేవారు. కానీ ఎక్కువ మంది ధనమదం, అధికారమదం తలకెక్కినవారు. బ్రిటిష్ వారు భారత దేశం వదలి వెళ్ళిపోతే తాము స్వతంత్ర ప్రభువులం కావచ్చని వారు కలలు కంటుండేవారు. స్వతంత్ర భారత ప్రభుత్వం తమను కూడా స్వతంత్ర ప్రభువులుగా గుర్తించి సమాన ప్రతిపత్తి ఇవ్వాలని వారు వాదిం చారు. వారిలో కొందరైతే ఐక్యరాజ్యసమితికి తమ ప్రతినిధులను పంపాలని కూడా ఆలోచించారు.

నిజానికి ఈ సంస్థానాలన్నీ స్వతంత్ర భారతంలో భాగంగా చేరకపోతే చాలా సమస్యలు తలెత్తి వుండేవి. ఆ సంస్థానాల గుండా రైళ్ళు నడపాలంటే భారతదేశం వారి అనుమతి పొందవలసి వచ్చేది. ఆ రాజ్యాల గుండా అంతర్ రాజ్య నదులు ప్రవహిస్తూవుంటే ఆ నీటిని వాడుకునేందుకు కూడా వారి అనుమతి కావలసిందే. ఆనకట్టలు కట్టాలన్నా వారి అనుమతి పొందాలి. భారతదేశానికి ఏదైనా దేశంతో యుద్ధం వస్తే ఈ 600 సంస్థానాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో? వారు ఎవరిని సమర్ధిస్తారో? దీనికి జవాబు చెప్పటం అసాధ్యం. వాటిలో ఒక సంస్థానమైన కాశ్మీర్ వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు.దాని ఫలితంగానే కాశ్మీర్లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్థాన్ ఆక్రమణలోనే వుంది. ఇప్పటికీ అది భారతదేశానికి ఒక తలనొప్పిగా మిగిలి పోయింది. ఆ సంస్థానాల సమస్యను సత్వరమే పరిష్క రించివుండకపోతే కాశ్మీర్ వంటివే మరెన్నో సమస్యలు మనను ప్రస్తుతం పీడిస్తూ వుండేవి.

“మనం కలిసివుంటే ఈ దేశాన్ని త్వరలోనే సమృద్ధం చేయగలం. రండి, మాతో కలవండి. మాతో సహకరించండి” అంటూ స్వాతంత్ర్యం రాక మునుపే సర్దార్ ఆయా సంస్థానాధీశులకు పిలుపునిచ్చారు. “ఆగస్టు 15లోగా మాతో కలవకపోతే ఆ తరువాత పరిస్థితి మరోవిధంగా వుంటుంది. ఇప్పుడు మీరు పొందుతున్న ఆదరణ, రాయితీలు ఆ తరువాత మీరు పొందలేకపోవచ్చు” అంటూ వారికి హెచ్చరిక కూడా చేశారు. పటేల్ చాలా మంది సంస్థానాధీశులను కలిసి వారితో చర్చలు జరిపారు. ఫలితంగా దేశభక్తి
గల సంస్థానాధీశులు పలువురు భారత యూనియన్లో చేరారు.

ఉక్కు మనిషి

అయితే జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాధీశులు మాత్రం పాకిస్థాన్ లో కలవటానికి రహస్యంగా కుట్రలు ప్రారంభించారు. పాకిస్థాన్ పనిపట్టటానికి బ్రిగేడియర్ గురు దయాళ్ సింహ నాయకత్వాన ఒక సైనిక దళాన్ని పటేల్ జునాగఢ్ సరిహద్దు వద్దకు పంపించారు. భారతదేశంలో కలవాలని కోరుకున్న జునాగఢ్ సంస్థాన పౌరులు తమ పాలకుడి మీద తిరుగుబాటు చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. ప్రజలను మోసగించాలని ప్రయత్నిం చిన నవాబు చివరకు పారిపోయాడు. 1947 నవంబరు 12 నాడు పటేల్ జునాగఢ్ చేరారు. హైదరాబాద్ నిజాం నవాబు వివేకవంతంగా ప్రవర్తించకపోతే ఆయనకు కూడా జునాగఢ్ నవాబుకు పట్టినగతే పడుతుందని పటేల్ ఆనాడు జునాగఢ్ లో చేసిన ప్రసంగంలో హెచ్చరించారు.

అయితే హైదరాబాదు నవాబు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు. ఆయన పాకిస్థాన్ కు లక్షలాది రూపాయలు పంపించాడు. నిజాం అనుచరుల్లో ఒకడైన ఖాసిం రజ్వీ అనేవాడు హిందువులను వేధించసాగాడు. వాడు రజాకార్ల ముఠా నాయకుడు. హిందువులను హైదరాబాద్ సంస్థానం నుంచి తరిమివేయాలని వారు ప్రయత్నించారు. వారు చేసే ఘోరాలకు అంతే లేకుండా పోయింది. వారు బయట నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తెచ్చుకోవాలని కూడా ప్రయత్నించారు.

సర్దార్ పటేల్ చివరకు జనరల్ చౌధురి నాయకత్వంలో ‘పోలీస్ చర్య’ తీసుకోవటానికి హైదరాబాదుకు సైనిక దళాలను పంపారు. అయిదు రోజుల్లోనే నిజాం నవాబు గతిలేక దాసోహమన్నాడు. ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కు పారిపోయాడు. అంతటితో రజాకార్ల దుశ్చర్యలకు తెరపడి హైదరాబాద్ లో శాంతి నెలకొన్నది. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ తన దృఢమైన నిర్ణయంతో భారత వ్యతిరేక కుతంత్రాలన్నింటినేఎ అణచివేశారు.

కాశ్మీరులో కూడా అలాంటి సమస్యే తల ఎత్తింది. కాశ్మీరు మహారాజు, ఆ సంస్థానపు శాసనసభ తమ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే నిర్ణయించడం జరిగింది. కానీ కాశ్మీరులోని అయిదింట రెండు వంతుల భూభాగాన్ని పాకిస్థాన్ సైన్యం బలప్రయోగంతో ఆక్రమించుకున్నది. కాశ్మీరు సమస్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధీనంలో వున్నందున ఆ విషయంలో పటేల్ ఏమీ చెయ్యలేకపోయారు. సర్దార్ పటేల్ కనుక అప్పుడు అంత చొరవ తీసుకుని ఉండకపోతే నేటి సమైక్య భారతం సాకారమై ఉండేది కాదు. ముక్కలు ముక్కలుగా వివిధ రాజ్యాలు పరస్పర కలహాలతో, ప్రాంత, భాషా భేదాలతో కొట్టుకు చస్తూ దేశం నిత్య రావణ కాష్టంగా రగులుతూ ఉండేది. అంతెందుకు? అసలు ఆ పరిస్థితిని కనీసం ఊహించనైనా సాధ్యం కాదు. బహుశా భారతదేశమే ఉండేది కూడా కాదేమో. కేవలం సర్దార్ పటేల్ చొరవ, ధైర్య సాహసాలు, వ్యవహార దక్షత అన్నిటికీ మించి ఆయనకు ఈ మాతృభూమి పట్ల ఉన్న భక్తి, దేశ అఖండత పట్ల ఉన్న ఆకాంక్ష, వారి అకుంఠిత దీక్షల ద్వారానే ఆ మహత్కార్యం సాధ్యమైంది.

దేశభక్తుల పుట్టిల్లు

సర్దార్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జన్మించారు. తల్లి లాడ్ బాయి, తండ్రి ఝువేర్ భాయ్. పటేల్ జీ తండ్రి ఝువేర్ భాయ్ కూడా గొప్ప దేశభక్తుడు. 1857 స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న ధీరుడు. ఇక అన్నగారు విఠల్ భాయి కూడా పేరుమోసిన దేశభక్తుడు. భారత శాసన మండలి చైర్మన్ గా కూడా పనిచేసినవాడు.

భీతిలేని బాలుడు

సర్దార్ పటేల్ బాలుడిగా వుండగా చేతిమీద ఒక వ్రణం(కురుపు) లేచింది. ఆ గ్రామంలోని నాటువైద్యుడు కాల్చిన ఇనుముతో వ్రణాలను కాల్చి నయం చేస్తుండేవాడు. వల్లభ్ కూడా ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఇనుప చువ్వను ఎర్రగా కాల్చారు. అయితే లేత వయసులో వున్న పిల్లవాడిని చూసి ఆ నాటు వైద్యుడు కాల్చడానికి తటపటాయించసాగాడు.
“ఇంకా ఎందుకు ఆగావు? ఇనుప చువ్వ చల్లారిపోతుంది. తొందరగా పుండుమీద అంటించు” అన్నాడు వల్లభ్.
ఆ మనిషికి మరింత భయంవేసింది. ఎర్రగా మండుతున్న ఇనుప చువ్వను తానే లాక్కుని తన పుండును కాల్చుకున్నాడు. వల్లభ్ భాయ్ మొఖాన బాధ ఛాయలే కనిపించలేదు. అతని ధైర్యాన్ని చూసి పెద్దలు, పిన్నలు అందరూ అబ్బురపడుతూ ఉండేవారు. అన్యాయం మీద తిరగబడ్డం అతని సహజ లక్షణం.

సాధనతో సమున్నత స్థానానికి

వల్లభాయి ప్రాధమిక విద్యాభ్యాసం కరంసాద్లో జరిగింది. తరువాత పెట్లాడ్ లోని స్కూలులో చేరాడు. రెండు సంవత్సరాల తరువాత నాదియాడ్ పట్టణంలోని హైస్కూల్లో చేరాడు.
పెట్లాడ్ లో వుండే రోజుల్లో వల్లభాయి స్వయంగా వంటచేసుకునేవాడు. ప్రతివారం తనకు కావలసిన వంట దినుసులు వేరే గ్రామంలో వున్న తమ ఇంటి నుండి తెచ్చుకుంటూ ఆ మొత్తం దూరం నడచివస్తుండేవాడు. రైలులో వెళ్లే వీలైతే వుంది కాని టిక్కెట్టు కొనటానికి అతనివద్ద డబ్బులుండేవి కావు.
బారిస్టరు కావాలన్నదే వల్లభాయి మనోరథం. ఈ కోరిక నెరవేరాలంటే తను ఇంగ్లండులో చదువు సాగించాలి. కాని తన కుటుంబం కటిక పేదరికంలో మగ్గుతున్నది. భారతదేశంలోనైనా కాలేజిలో చేరటానికి తగినంత డబ్బులేదు తనకు. ఆ రోజుల్లో అభ్యర్థులు ప్రైవేటుగా చదివి లా పరీక్షకు కూర్చునే వీలుండేది. వల్లభాయి అన్న విఠల్ భాయి కూడా లాయరే. ఆయన పరీక్షకు కూర్చునే ముందు కోచింగ్ క్లాసులకు హాజరైనాడు. వల్లభాయి మాత్రం కోచింగ్ క్లాసులకు కూడా హాజరు కాలేదు. తనకు తెలిసిన ఒక లాయరునడిగి పుస్తకాలు అరుపు తెచ్చుకొని ఇంటివద్దనే చదివాడు. అప్పుడప్పుడు న్యాయ స్థానాలకు వెళ్లి గమనించేవాడు. అవి ఇచ్చే తీర్పులను అధ్యయనం చేసేవాడు. లాయర్ల వాద ప్రతివాదాలను శ్రద్ధగా ఆలకించేవాడు. మొత్తానికి వల్లభాయి పరీక్ష పాసయినాడు.

న్యాయవాద వృత్తి ప్రారంభించటానికి కావలసిన సౌకర్యాలేవీ వల్లభాయికి బొత్తిగా లేవు. స్నేహితుల దగ్గర అప్పుచేసి గోధ్రా అనే పట్టణంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గదిలో రెండు కుర్చీలు వేశాడు. క్రింద కూర్చొనగోరే వారికోసం చాపలు పరిచాడు. అనతికాలంలోనే ఈ చురుకైన యువకుడి దగ్గరకు క్లయింట్లు ఆకర్షితులై రావటం ప్రారంభించారు. ఏ కేసు తీసుకున్నా వల్లభాయి దానిని ఆసాంతం అధ్యయనం చేసేవాడు.

కొద్దిరోజుల్లోనే చాలా మంచి లాయరుగా వల్లభాయి పేరుతెచ్చుకున్నాడు. అప్పటికే వివాహం చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు కూతురు మణి బెన్, కొడుకు దయాభాయి. వల్లభాయి భార్య అస్వస్థురాలు కావటంతో ఆమెను చికిత్స కోసం ముంబైకి పంపాడు.

ఒక రోజు వల్లభాయి కోర్టులొ చాలా ముఖ్యమైన ఒక కేసు కోసం హాజరవుతున్నాడు. ఏకాగ్రచిత్తంతో న్యాయమూర్తి ఎదుట కేసు వాదిస్తున్నాడు. ఆయన అలా నాదిస్తూ వుండగానే ఒక అర్జంటు టెలిగ్రాం ఆయన చేతికి ఇచ్చారు. అందులోని విషయం ఏమిటో ఒక్కసారి చూసి, మడతపెట్టి జేబులో పెట్టుకొని మళ్లీ తన వాదన కొనసాగించాడు. ఆ టెలిగ్రాంలో ఆయన భార్య మరణించినట్లు వార్త వుంది! ఆయన తన ఉపన్యాసం దాకా ఆ పూర్తి చేసి కూర్చునే దాకా ఆ సంగతి ఆయన దగ్గరవున్నవారికి కూడా తెలియలేదు. భార్య మరణించిన నాటికి వల్లభాయిపటేల్ వయసు ముప్ఫై మూడేండ్లు. ఆయన మళ్ళీ వివాహం చేసుకోదలచలేదు.

సర్దార్ పటేల్ అన్నగారు విఠల్ భాయి ఇంగ్లండు వెళ్లి బారిస్టరు చదువు పూర్తి చేసి వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన మీదట వల్లభాయి ఇంగ్లండ్ వెళ్ళాడు. అక్కడ ఏకాగ్ర భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేశాడు. అక్కడి ఆడంబర జీవితపు తళుకు బెళుకులు, భోగవిలాసాలు చూసి మోహితుడు కాలేదు. ఆయన వసతి భవనానికి గ్రంథాలయం పదకొండు మైళ్ళ దూరంలో వుండేది. ప్రతి ఉదయం గ్రంథాలయానికి నడచివెళ్లి సాయంకాలానికి మళ్లీ నడచి వచ్చేవాడు. బారిష్టర్ ఎట్ లా పరీక్ష ప్రథమ శ్రేణిలో పాసైనాడు. భారతదేశానికి తిరిగి రాగానే అహ్మదాబాద్ లో బారిష్టర్ ప్రాక్టీసు ప్రారంభించాడు. రోజు రోజుకు ఆయన కీర్తి, ప్రభావం పెరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లోనే ఆయన నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు సంపాదించేవాడు.

ప్రజా ఉద్యమాలు

రాజకీయాల పట్ల, స్వాతంత్ర్యోద్యమం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వల్లభాయ్ గాంధీజీ పరిచయంతో, ప్రభావంతో స్వాతంత్ర్యోద్యమ నాయకుడయ్యాడు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బ తిని ఇబ్బందులు పడుతున్న రైతులను పన్నులు చెల్లించమని వేధిస్తున్న ఆంగ్లేయ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గాంధీజీ సూచనతో గుజరాత్ వ్యాప్తంగా ఒక రైతు ఉద్యమాన్ని నడిపారు వల్లభాయ్.

సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా వేలాది రూపాయలను తెచ్చి పెడుతున్న బారిస్టరు వృత్తిని త్యజించారు. పిల్లలను దేశభక్తులుగా తీర్చిదిద్దే విద్యను అందించటానికి ఆయన గుజరాత్ విద్యా పీఠాన్ని స్థాపించారు.

1923 లో నాగపూర్ లో ప్రభుత్వ కార్యాలయాలున్న ఏ రోడ్డులోనూ త్రివర్ణ పతాకాలను ఎగురవేయకూడదని ఆంగ్లేయ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందుకు ప్రతిగా మూడున్నరేళ్ళ పాటు ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని నడిపారు పటేల్ జీ. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

గుజరాత్ రైతులు వరదలతో నష్టపోయి, కరువుతో తీవ్ర ఇక్కట్లపాలై బాధలు పడుతున్నప్పుడు రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వమే వారిని కష్ట సమయంలో ఆదుకోవాలని ఆయన ఆంగ్లేయ ప్రభుత్వంతో వాదించారు. ప్రభుత్వం అందుకు తల ఒగ్గి గుజరాత్ రైతులకు 1.5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా అనేక సహాయ కార్యకరమాలకు ఆ డబ్బును సమర్ధంగా వినియోగించి తాను అసమాన పోరాట దక్షుడనే కాక అద్భుత కార్య కుశలుడనని చాటారు వల్లభాయ్.

బార్దోలి రైతులకు మద్దతుగా జరిగిన అతి పెద్ద ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేసి ఆంగ్లేయ ప్రభుత్వం మెడలు వంచిన వల్లభాయ్ పటేల్ ని ఆరోజు నుంచి ప్రజలు ‘సర్దార్ పటేల్’ అని ప్రేమగా పిలుచుకోవడం ప్రారంభమయ్యింది.

ముక్కు సూటి మనిషి

1937లో అన్ని ప్రాంతాల శాసన సభలకు ఎన్నికలు జరిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు పటేల్ ఛైర్మన్ గా వున్నాడు. ఆయన నాయకత్వంలో ‘ కాంగ్రెసు ఎనిమిది ప్రాంతాలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని మంత్రివర్గాలు ఏర్పరచింది. వాటన్నిటి కళ్ళాలు పటేల్ జీ చేతుల్లోనే వున్నాయి. ఏ మంత్రి అయినా తప్పుచేస్తే సర్దార్ వారిని నిస్సంకోచంగా నిలదీసేవారు.

అప్పట్లో ముస్లింలీగ్ ఏవేవో చిక్కు సమస్యలు సృష్టిస్తూ స్వాతంత్య్ర సాధన మరింత కష్టతరమయేట్లు చేసింది. భారతదేశ స్వాతంత్య్రానికి అడ్డు పడుతున్న వాళ్ళందరితోనూ మేము పోరాడుతాం” అని ప్రకటించారు సర్దార్ పటేల్.

దూరదృష్టి

సర్దార్ పటేల్ ఎంతో దూరదృష్టి గల వ్యక్తి. 1962లో చైనా తన సైన్యాన్ని భారత సరిహద్దుల మీదకు పంపగా వారి దెబ్బకు భారతదేశం దిమ్మెరపోయింది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన సన్నివేశమిది. అయితే ఇది జరగటానికి చాలాకాలం క్రిందటనే 1950 నవంబరు 7వ తేదీన జవహర్లాల్ నెహ్రూకు పటేల్ ఒక ఉత్తరం వ్రాస్తూ చైనాను విశ్వసించటానికి వీలులేదని తెలియజేశారు. “చైనా ప్రభుత్వం తాము శాంతి కాముకులమని చెప్పుకుంటూ మోసగించాలని చూస్తున్నది. ఇకనుండి మనదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పథకాలు తయారు చేసేటప్పుడు కమ్యూనిస్టు చైనా దురాలోచనలను మనం గుర్తుంచుకుని తీరాలి” అని వ్రాశారు.

తరువాత అయిదు వారాలకు 1950 డిసెంబరు 15 నాటి ఉదయం ముంబైలో ఆయన కాలధర్మం చెందారు. ఆయన మరణించిన పన్నెండు సంవత్స రాలకు భారతదేశంపై చైనా దాడి చేసింది.

బార్డోలీ సేనాధిపతి, గుజరాత్ సింహం, భారతదేశపు ఉక్కుమనిషి దేశ స్వాతంత్య్ర సమరాంగణపు సర్దార్, భారత సమైక్యతా సౌధ మహాశిల్పి. వజ్ర సంకల్పుడైన వల్లభాయి పటేల్ని మనం కోల్పోయాం. అప్పటికి ఆయన వయసు డెబ్బై అయిదు. నవభారత రూపశిల్పి ఆయన. ధైర్యానికి, ప్రేరణకు తరగని గని ఆయన.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.