
ముంబై: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ ట్విటర్ వేదికగా పరస్పరం ట్వీట్ల దాడి చేసుకున్నారు. అమిర్ పాత వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు.
అందులో హర్భజన్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది వరుసగా సిక్సర్లు బాదినట్టు ఉంది. దీంతో భజ్జీ.. 2010 ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమిర్ వేసిన ‘నో బాల్’ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశాడు. దానికి ‘ప్రజలు నిన్ను చూసేది డబ్బు కోసం పాకులాడేవాడిగానే…. గౌరవం, అభిమానం ఏమీ లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. మీ దేశ ప్రజలు మద్దతుదారులకు ఎంత లభించిందో మీరు చెప్పరు.
క్రికెట్‌ను ఈ విధంగా అవమానించి.. ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటివారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది’ ట్వీట్ పెట్టాడు. దానితోపాటు మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో భజ్జీ సిక్సర్ బాది టీమిండియాను గెలిపించిన వీడియోను పోస్టు చేసి ‘ ఫిక్సర్‌కి సిక్సర్.. ఇక పద పోదాం’ అన్నట్టుగా క్యాప్షన్ ఇచ్చాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే అప్పటి పాక్ ఆటగాళ్లైన మహమ్మద్ అమిర్‌తోపాటు మహమ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు రుజువైంది. అమిర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు 2016లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవకాశం కల్పించింది. 29 ఏళ్ల వయసులోనే గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు అమిర్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Source: Eenadu





