
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల పాలైన దేశం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది! ఇస్లామిక్ దేశాలు కూడా పాక్ అంటే ముఖం చాటేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌కు అన్నింటికి చైనానే దిక్కు అన్నట్టుగా ఉంది. అయితే, ఇందులో ఇంకొక ట్వీస్టు ఏమిటంటే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌తో పాకిస్తాన్‌కు మేలు కంటే కూడా కీడే ఎక్కువగా జరుగుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్టు ప్రతిబంధకంగా మారిందని ఆ దేశానికి చెందిన డాన్ అనే పత్రిక కథనాలను ప్రచురిస్తోంది. అయితే, ఈ సీపీఈసీ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమని ఆ ప్రాజెక్టు చీఫ్ ఖలీద్ మన్సూర్ మాత్రం పాక్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ఆ దేశ పత్రికలనే కాదు, అంతర్జాతీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
డ్రాగన్ చైనా తన వ్యాపార ప్రభావాన్ని మధ్య ఆసియా దేశాలకు, వ్యూహాత్మకంగా విస్తరించే క్రమంలో, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ బీఆర్‌ఐని తెరపైకి తీసుకుని వచ్చింది. సత్వర ఆర్థిక అభివృద్ధిని ఎరగా చూపి, ఆయా దేశాలను ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేసింది. అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు భారీగా రుణాలు ఇచ్చింది. అవి ఎంతలా అంటే ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా.! శ్రీలంక, కిర్గిజ్, తజకిస్తాన్, ఉక్రెయిన్, బెలారస్, ఇథియోపియా, కెన్యా, కాంబోడియా, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చైనా భారీగా రుణాలిచ్చింది.!
2020 డిసెంబర్ నాటికే పాక్ అప్పులు 294 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్థాన్ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. గతేడాది పారిస్ క్లబ్ నుంచి 11 బిలియన్ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్ డాలర్లు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది.
Source: NationalistHub





