
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భవానీమాలలు వేసుకుని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మండల దీక్షల అనంతరం అమ్మవారి దర్శనానికి రాష్ట్రమంతటి నుంచి విచ్చేసిన భక్తుల దర్శనానికి, దీక్ష విరమణకు తగిన ఏర్పాట్లు చెయ్యకుండా VIP ల దర్శన ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఆలయ సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రమంతటి నుంచి విచ్చేసిన భక్తులను VIP ల దర్శనాల పేరుతో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కలెక్టర్ సమక్షంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయంలో ఒక్కసారిగా “సీఎం డౌన్ డౌన్” నినాదాలు మిన్నంటాయి.
ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల నగరోత్సవం దేదీప్యమానంగా సాగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల నగరోత్సవం నిర్వహించారు.
మల్లేశ్వరాలయం నుంచి ప్రారంభమైన నగరోత్సవం మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా సాగింది. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు.
అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలవిహారం నిలిపివేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వారంతా నిరాశతో వెనుదిరిగారు.





