News

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి

760views

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ”శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగుస్తాయి. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తాం. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నాం” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఆలయ విశేషాలకు వస్తే.. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్ ‌’సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది. అయోధ్యలో భవ్య రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి. 2.77 ఎకరాల విస్తీర్ణం. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.