
-
లష్కరే తాయిబాతో చేతులు కలిపిన సైన్యాధికారులు
-
పేదలు, అనాథలే ‘జిహాద్’ కోసం బలి
-
శిక్షణలో రూ. 20 వేల అందజేత
-
ఇమ్రాన్ సర్కార్ అరాచకాలను వెల్లడించిన ఉగ్రవాది బాబర్
న్యూఢిల్లీ: భారత సైన్యం ఈ నెల 26న ‘అలీ బాబర్ పాత్ర’గా గుర్తించబడిన ఒక లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉరి సెక్టార్లో ఈ నెల 18 – 19 మధ్య రాత్రి సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు.
వారిలో అలీ బాబర్ కూడా ఒకడు. భారతదేశంలోని నియంత్రణ రేఖకు(ఎల్.ఓ.సి.) సమీపంలో ఉన్న జాబ్రి పోస్ట్ నుండి ఆరుగురు ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడడానికి ఎల్ఈటి ప్రయత్నించింది. నలుగురు ఉగ్రవాదులు వెనక్కి పారిపోగా.. ఇద్దరు ఉగ్రవాదులు భారతదేశం వైపు ప్రవేశించారు.
ఉగ్రవాదుల ఆచూకీ కోసం అనుమానిత ప్రాంతాల్లో అనేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం పంజాబ్(పాకిస్తాన్)కు చెందిన 33 ఏళ్ల పాకిస్థాన్ తీవ్రవాది అతీక్ ఉర్ రెహ్మాన్ అలియాస్ క్వారీ అనాస్‌ను భారత భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది.
రెండో ఉగ్రవాది పంజాబ్(పాకిస్తాన్) ఒకారాకు చెందిన అలీ బాబర్ పాత్రగా గుర్తించారు. అతడిని లొంగిపోవాలని సూచించారు. దీంతో అతన్ని సజీవంగా పట్టుకున్నారు. పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అలీ బాబర్‌ను ఆర్మీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పాక్ ఉగ్రవాది పలు విషయాలను వెల్లడిరచాడు.
పాక్ ఆర్మీ ఉగ్ర శిక్షణ ఇచ్చింది…
అతడు కెమెరా ముందుకు వచ్చి పాకిస్తాన్ కుతంత్రాలను బయటపెట్టాడు. తనకు పాక్ ఆర్మీ, లష్కరే తాయిబా ఉగ్రసంస్థలు శిక్షణ ఇచ్చాయని అలీ బాబర్ స్పష్టం చేశాడు. బారాముల్లాలో ఒక ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు రూ. 20 వేలు ఇచ్చారని.. తమది పేద కుటుంబమని, తనకు తండ్రి లేడని తెలిపాడు. వస్త్ర పరిశ్రమలో పనిచేసే సమయంలో ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఓ కుర్రాడితో తనకు పరిచయం ఏర్పడిందని, డబ్బుకు ఆశపడి అతనితో కలిసి లష్కరేలో చేరానని చెప్పాడు.

ముజఫరాబాద్‌లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని శిక్షణ సమయంలో తనకు 20 వేలు ఇచ్చారని తెలిపాడు. శిక్షణ తర్వాత రూ. 30 వేలు ఇస్తామన్నారని తెలిపాడు. శిక్షణ పూర్తయిన తర్వాత తనను పాక్ సైన్యం వద్దకు తీసుకెళ్లారని.. వారి ఆదేశాల మేరకు తాను, మరి కొందరు భారత్‌లో చొరబడేందుకు యత్నించామని తెలిపాడు.
జిహాద్ కోసం పేదలకు వల
జిహాద్ కోసం లష్కర్ పేదలను, అనాథలను సిద్ధం చేస్తోందని బాబర్ తెలిపాడు. కాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ అణచివేయబడ్డారని శిక్షణ సమయంలో తనకు చెప్పారని.. కానీ ఇక్కడ ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారని వెల్లడిరచాడు. ఇండియన్ ఆర్మీ నన్ను బాగా చూసుకుంది.. ఆర్మీ తనకు అందించిన టీ కూడా బాగుందని అలీ బాబర్ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/i/status/1443099320262135810
ఇండియన్ ఆర్మీ ప్రకటన
19 ఏళ్ల లష్కర్ ఉగ్రవాది అలీ బాబర్ పాత్రను ఆర్మీ అరెస్టు చేసినట్టు మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ తెలిపారు. అలీ బాబర్ ఉగ్రవాదిగా మారడానికి మూడు నెలల పాటు లష్కర్ దగ్గర శిక్షణ పొందాడు. భారత్‌లోకి చొరబడి ఉరి వంటి దాడిని చేయాలని భావించారు తీవ్రవాదులు.
లొంగిపోవాలని ఉగ్రవాదిని అడిగినట్టు మేజర్ వత్స్ తెలిపారు. సెప్టెంబర్ 18న చొరబడటానికి ప్రయత్నించగా.. ఆరుగురు ఉగ్రవాదులలో నలుగురు వెనక్కి పరుగెత్తారు.. కానీ ఇద్దరు చొరబడ్డారు. సెప్టెంబర్ 26న ఒక ఉగ్రవాది హతమయ్యాడు, రెండోవాడు లొంగిపోయాడని వివరించారు.
Source: Nationalist Hub





