News

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ

538views

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్టు తన ట్వీట్‌లో చెప్పారు.

క్వాడ్‌ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్టు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్‌, ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్‌ మారిసన్‌, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్టు తెలిపారు.

కొవిడ్‌-19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి 26 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్వాడ్‌ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి