
పనికిరావని పారేసే వస్తువులతో ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు విశాఖకు చెందిన ఉమాబాల. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘పునరపి’ పేరుతో వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించి, వాడిపోయిన పూలు, ఆవు పేడ, కొబ్బరిపీచు, పాత కాగితాలకు కొత్త రూపునిస్తున్నారు. వ్యర్థాలను వనరులుగా మార్చుతూ పర్యావరణహిత జీవనశైలికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
సివిల్ ఇంజినీరింగ్ చదివిన ఉమాబాల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఈ పూర్తి చేశారు. అనంతరం ఎంఏ మ్యూజిక్ కూడా అభ్యసించారు. తన విద్య, సృజనాత్మకతను పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించాలనే ఆలోచనతో ‘పునరపి’ని ప్రారంభించారు. దేవాలయాల్లో సమర్పించిన వాడిపోయిన పూలతో అగరుబత్తీలు తయారు చేయడంతో పాటు, రైతుల నుంచి సేకరించిన ఆవు పేడకు చెట్ల బెరడు పొడిని కలిపి వివిధ ఆకృతుల్లో వస్తువులు, దేవతా విగ్రహాలను రూపొందిస్తున్నారు.
దీపావళి సందర్భంగా గోమయంతో లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా గోమయానికి సుగంధ ద్రవ్యాలు జోడించి అగరుబత్తీలు, ధూపాలు, అగరుబత్తీల స్టాండ్లు, పూజా సామగ్రిని రూపొందిస్తున్నారు. రాఖీలు, కీచెయిన్లు, హోమ్ డెకార్ వస్తువులు, నిమజ్జనం తర్వాత మొలకెత్తే విగ్రహాలు, కొబ్బరిపీచుతో డిష్వాష్ స్క్రబ్బర్లు, పాత కాగితాలతో పెన్సిళ్లు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
తన ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసేందుకు పర్యావరణహిత ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదించడం కంటే ప్రకృతికి మేలు చేయడం, వ్యర్థాలను తగ్గించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఉమాబాల చెబుతున్నారు. పారేయాల్సిన వస్తువులనే కొత్త ఉత్పత్తులుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చని ఆమె సందేశమిస్తున్నారు.
‘వ్యర్థమని పక్కన పెట్టేయకుండా, వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఎన్నో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ప్రకృతికి మేలు చేయడంతో పాటు సృజనాత్మకతను కూడా చాటుకోవచ్చు’ అని ఉమాబాల అంటున్నారు. నిజంగా, పర్యావరణ పరిరక్షణకు వినూత్న ఆలోచన, పట్టుదల తోడైతే వ్యర్థాల నుంచే అద్భుతాలను సృష్టించవచ్చని ఆమె ప్రయాణం నిరూపిస్తోంది.





