
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు యూపీ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ ముష్కరులను మసీరుద్దీన్, మిన్హాజ్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడులు చేయడంలో వారిద్దరూ శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. వారి స్థావరాల నుంచి రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఆయుధాలు, ఓ డిటొనేటర్, 6-7 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు అందిన సమాచారం ఆధారంగా కాకోరీ ప్రాంతంలో నిఘాపెట్టి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్టు చెప్పారు. వారి సహచరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
అల్‌ఖైదా యూపీ విభాగానికి ఉమర్ హల్మింది నేతృత్వం వహిస్తున్నట్లు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అతడు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో క్వెట్టా, పెషావర్ లాంటి ప్రదేశాల్లో తన ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు వివరించారు. అతడు లఖ్‌నవూకు చెందిన పలువురు యువకులకు ఉగ్రవాదం వైపు ప్రేరేపించి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసిన వారిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లఖ్‌నవూలో ఓ భాజపా ఎంపీ సహా మరికొందరు సీనియర్ నాయకులను వారు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.





