
జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్ము శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఆరుసార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పాకిస్థాన్ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్ములో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని సైన్యం భగ్నం చేసింది. రెండు రోజుల తర్వాత కాలూచక్, రత్నచక్ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కన్పించాయి.





