News

చైనా, రష్యాలపై హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఎక్కుపెట్టనున్న అమెరికా?

493views

ధ్వని కన్నా ఏడు రెట్లు వేగంతో ఫిరంగి గుళ్లను ప్రయోగించే భవిష్యత్‌తరం ‘రెయిల్‌ గన్‌’ ప్రాజెక్టుకు అమెరికా నౌకాదళం నీళ్లొదిలింది. దీనికి బదులుగా హైపర్‌సోనిక్‌ క్షిపణులపై దృష్టిపెట్టింది. చైనా, రష్యాలు లక్ష్యంగా ఈ చర్యను చేపట్టింది. అమెరికా నౌకాదళం దశాబ్దకాలంగా విద్యుదయస్కాంత రెయిల్‌ గన్‌ ప్రాజెక్టుపై సర్వశక్తులూ ఒడ్డింది. దాన్ని జుమ్‌వాల్ట్‌ తరగతి స్టెల్త్‌ యుద్ధనౌకలపై మోహరించాలని యోచించింది. అయితే తాజా బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు జరపలేదు. దీన్ని ప్రస్తుతానికి అటకెక్కించినట్లేనని రక్షణ విశ్లేషకులు పేర్కొన్నారు.

రెయిల్‌ గన్‌ పరిజ్ఞానంలో ఉన్న లోపాలు, ఆ ఆయుధం ద్వారా వెలువడే ఫిరంగి గుళ్లతో పోలిస్తే హైపర్‌ సోనిక్‌ క్షిపణులు పరిధి ఎక్కువగా ఉండటం వంటి కారణాలను అమెరికా పరిగణనలోకి తీసుకొని ఉంటుందని విశ్లేషించారు. రెయిల్‌ గన్‌ పరిజ్ఞానం ఒకప్పుడు సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలో ఉండేది. ఇప్పుడు అది వాస్తవ రూపానికి చేరువైంది. వీటి ప్రొటోటైప్‌లు కూడా సిద్ధమయ్యాయి. స్మార్ట్‌ బాంబులు, క్షిపణులతో పోలిస్తే పోలిస్తే దీని నిర్వహణ చౌక. ఎందుకంటే రెయిల్‌ గన్స్‌లో గన్‌పౌడర్‌కు బదులు విద్యుత్‌ను ఉపయోగిస్తారు. లక్ష్యాలను ఛేదించడానికి అవసరమైన స్థాయిలో అవి గతిజశక్తిని సృష్టిస్తాయి. అయితే ఈ ఆయుధం పరిధి 110 కిలోమీటర్లు మాత్రమే ఉందని పరీక్షల్లో తేలింది. అందువల్ల శత్రు యుద్ధనౌకపై విరుచుకుపడాలంటే.. దానికి దగ్గరగా వెళ్లకతప్పదు. ఈ క్రమంలో ప్రత్యర్థి నుంచి క్షిపణి దాడి ముప్పు పొంచి ఉంటుందని విశ్లేషకులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.