
645views
మీడియా పై చైనా దాష్టీకం అంతకంతకూ పెరుగుతోంది. తనకు వ్యతిరేకంగా రాసింది అనే కారణంతో హాంకాంగ్‌లో అధిక జనాదరణ ఉన్న ప్రజాస్వామ్య అనుకూల దినపత్రిక ‘యాపిల్ డైలీ’ని వేధింపులకు గురి చేస్తోంది. చైనా కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక యాజమాన్యం పత్రికను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌లో మీడియా స్వేచ్ఛకు విఘాతమేర్పడడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో గతవారం యాపిల్ డైలీ కార్యాలయాలలో సోదాలు జరిపారు. ఆ తరువాత ఆ పత్రిక యాజమాన్య సంస్థకు చెందిన 16.4 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశారు.
పత్రిక చీఫ్ ఎడిటర్, మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లను పోలీసులు నిర్బంధించారు. యాపిల్ డైలీ వ్యవస్థాపకులు జిమ్మీ లాయీ ఇప్పటికే జైలులో ఉన్నారు.





