News

50%మంది మాస్క్‌ పెట్టుకోవట్లేదు: కేంద్రం

481views

దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్‌లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్‌లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా పెట్టుకోవడంలేదని ఓ అధ్యయనంలో తెలిందని పేర్కొంది.

20 శాతం మంది గడ్డం దగ్గరకు మాస్క్‌ తీసుకొచ్చి ఉంచుతున్నారని, మరో 2శాతం మంది మెడ దగ్గర ఉంచుతున్నట్టు ఆందోళన వ్యక్తంచేసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే మాస్క్‌లు సరిగా పెట్టుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారు మాత్రమే వైరస్‌ ప్రవేశించకుండా పకడ్బందీగా ముక్కు, నోరు, గడ్డాన్ని కప్పి ఉంచేలా మాస్క్‌లు పెట్టుకొంటున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. దేశంలో లక్ష కన్నా ఎక్కువ యాక్టివ్‌ కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. 50వేల నుంచి లక్ష యాక్టివ్‌ కేసులు 9 రాష్ట్రాల్లో; 50వేలకు పైగా క్రియాశీల కేసులు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు వివరించారు. కర్ణాటక, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో 25శాతం పాజిటివిటీ రేటు ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయాలంటే భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించడం అవసరమని కేంద్రం విజ్ఞప్తి చేసింది..

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.