
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు…21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం… చేసి దాదాపు 500 ఆక్సిజన్ ట్యాంకర్లను మోసుకొచ్చాయి మన వాయుసేన విమానాలు. మెడికల్ ఆక్సిజన్ సరఫరా, కొవిడ్ రిలీఫ్ ఆపరేషన్లలో వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్ సి-130జే ఎస్ విహంగాలు పాలు పంచుకున్నాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేశాయి. దేశీయంగా మన పైలట్లు 939 గంటలు పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్ కంటైనర్లు, 163.3 మెట్రిక్ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆస్పత్రులకు చేర్చాయని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.
ముందుకొచ్చిన వివిధ దేశాలు…
ఆక్సిజన్, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్ విమానాలు, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి వాయు సేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.





