ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

761views

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా అయోధ్య ధార్మిక శ్రద్దా కేంద్రంగా కొనసాగింది.

విక్రమాదిత్యుడు శిధిలమైన శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని పునర్నిర్మించాడు. 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తనకు గయలో జ్ఞానోదయం అయిన తరువాత కాశీ నుండి ప్రారంభించి ధర్మ ప్రచారం చేస్తూ అయోధ్య కూడా వెళ్లాడు. తనను సూర్య వంశపు క్షత్రియ రాజుగా పరిచయం చేసుకున్నాడు. సిక్కు మత స్థాపకుడు శ్రీ గురునానక్ దేవ్ అయోధ్యను దర్శించారు. సంత్ తులసీదాస్ నుండి మొన్నటి స్వామి వివేకానందుని వరకు వివిధ కాలాల్లో అనేక మంది మహా పురుషులు అయోధ్యను దర్శించుకున్నారు.

నేటికీ అయోధ్యలో దేశంలోని అన్ని ధార్మిక సంప్రదాయాల దేవాలయాలు…జైన మందిరాలు, సిఖ్ గురుద్వారా, సంత్ శిరోమణి రవిదాస మందిరం,…..ఇలా అనేక మందిరాలు ఉన్నాయి. అయోధ్య అనాదిగా భారతీయ మతాలకు కేంద్రం,చిన్న స్వరూప భారతం.

బాబర్ దాడితో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం ద్వసం అయింది. ఆ స్థానంలో మశీదు నిర్మాణమయింది. శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణము కొరకు 74 పోరాటాలు జరిగాయి. 3 లక్షల మందికి పైగా అశువులు బాసారు. 1949 నుండి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. 1989 నుండి పెద్ద ప్రజా ఉద్యమం సాధు సంతుల ఆధ్వర్యంలో జరిగింది. లక్షల గ్రామాల నుండి కోట్లాది మంది భక్తులు పూజించిన ఇటుకలు శ్రీ రామ మందిరం కోసం అయోధ్య చేరాయి. మందిర నిర్మాణం కొరకు రాతి స్తంభాలు కరసేవక పురంలో నిరంతరంగా తయారవుతున్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఏకాభిప్రాయంతో శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తీర్పు ఇచ్చింది. భూమి పూజ జరిగింది. మందిర నిర్మాణ నమూనా సవరణలతో తయారైంది.

2021 సంక్రాంతి నుండి ఫిబ్రవరి చివరి వరకు 43 రోజులలో దేశ వ్యాప్తంగా 5,50,000 గ్రామాలు,పట్టణాలలో శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు,అన్ని సంప్రదాయాలకు చెందిన భక్తులు మందిర నిర్మాణం కోసం నిధిని సమర్పించారు. BC,SC,ST,DNT, సంచార తెగల ప్రజలు,అత్యంత పేదలు వారి శక్తికి నుంచి ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. శ్రీ రాముడు ఉత్తమ మానవుడు, భగవత్ స్వరూపుడే కాదు, ఒక గొప్ప జాతీయ మహా పురుషుడు అనే విషయం మరో మారు వ్యక్తం అయింది.

శ్రీ రామ జన్మభూమి మందిరంలో గల బాల రాముడు(రామ్ లాలా) నూతన మందిర నిర్మాణం కొరకు తాత్కాలికంగా నిర్మాణం అయిన మందిరంలోకి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్ చేతుల మీదుగా తరలింపబడ్డాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక ప్రాచీన పీఠం గోరఖ్ నాథ్ పీఠపు దర్మాచార్యులు కూడా. తాత్కాలిక మందిరంలో బాల రాముడు నిత్య పూజలు, హారతులు అందుకుంటున్నాడు.

దేశమంతటా ధర్మ జాగరణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయోథ్య నగరంలో ఏమి జరిగింది?

ఉద్యమ సందర్భంగా శ్రీ రామ భక్తులు అయోధ్య మహా నగరంలోని అన్ని కుటుంబాలకూ, ఇంటింటికీ వెళ్లారు . అయోధ్యా నగరంలో నివసించే ఎస్సీలు…. నిషాద, వాల్మీకి, ఫాసి, కోరి, రవిదాసి, డోమ కులస్థులు అందరూ ఎంతో భక్తితో నిధిని సమర్పించారు. నగరంలో గల సిక్కు గురుద్వారా, జైన మందిరం, రవిదాస్ మందిరం, వాల్మీకి మందిరం….తదితర మందిరాల వారు ఎంతో ఆనందంగా శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయోధ్య గ్రామీణ జిల్లాలోని 913 గ్రామాలలో అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు శ్రీ రామ మందిర నిర్మాణంలో సహకరించారు.

అయోధ్య నగరం మహా నగరంగా పెరిగింది. ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య నగరం ఉండేది. ఇప్పుడు అనేక చుట్టు ప్రక్కల గ్రామాలను కలుపుకుని అయోధ్య మహా నగరంగా ప్రకటింప బడింది. అయోధ్య జిల్లాలో ఫైజాబాద్ ఒక భాగం అయింది.గంగా నదికి వలె సరయూ నదికి ఆరతీ ఘాట్లో రోజూ ఆరతి ఇవ్వడం ప్రారంభమైంది. అయోధ్య మహా నగరంలో రోడ్డు ప్రక్కన గోడలపై ఎంతో చక్కగా శ్రీ రాముని కథను వివరించే చిత్రాలు గీయబడ్డాయి. అనేక దేవాలయాలు గల్గిన వీధిలో గల సరయూ నది పాయలో శుభ్రమైన సరయూ నది నీళ్ళు ప్రవహించేట్లు ప్రభుత్వం చర్యలు తీసు కుంది. గత 4 సంవత్సరాలుగా లక్షల దీపాలను దీపావళి సమయంలో వెలిగించడం ప్రారంభమైంది. ఈ దీపాలను వెల్గించే శుభ కార్యంలో ఆధునిక విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడి ముందుకు రావడం అయోధ్య యువత మనస్సుల ఆలోచనలను వ్యక్తం చేస్తోంది. మహా నగరంలో కూడలిలో ఒక భవ్యమైన శ్రీ రామ విగ్రహం నిర్మాణం అవుతోంది. ఇప్పటికే భక్తుల రాక ఎన్నో రెట్లు పెరిగింది. చిన్నా,పెద్దా వ్యాపారాలు పెరిగాయి. సామాన్య ప్రజల ఉపాధి అవకాశాలు పెరిగాయి.

మందిర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ L&T అధ్వర్యంలో మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2023 నాటికి మందిర నిర్మాణము పూర్తి అవుతుంది. అయోధ్యకు రాక పోకల దృష్ట్యా దేశం నలుమూలల నుండీ నాల్గు రోడ్ల వెడల్పు గల్గిన రోడ్లు యుద్ద ప్రాతిపదికన ప్రారంభం అయ్యాయి. రైలు మార్గాలు, నూతన రైళ్లు, ఆతిథ్య రైల్వే స్టేషన్, విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో విస్తరింప బడుతున్నాయి. అయోధ్య మహా నగరపు రూపు రేఖలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలతో మారనున్నాయి.
నేడు తిరుపతికి సాధారణ రోజుల్లో 50 వేల మంది భక్తులు వస్తున్నారు. అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం అయిన వెంటనే రోజులు ఒక లక్ష మంది భక్తులు దర్శనం కొరకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు భారత దేశానికి దార్మి కంగా,సామాజికంగా అయోధ్య ముఖ్య పట్టణం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంకొక అడుగు ముందు వేసి రామ రాజ్యం రాక కోసం ఎదురు చూద్దాం, కృషి చేద్దాం.

– K. శ్యామ్ ప్రసాద్,  సామాజిక సమరసత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.