జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్, కల్నల్ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. ”హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం వారు అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు.
హంద్వారా ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. మహా దళపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి కలగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
హంద్వారాలోని ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ అశుతోష్ శర్మ, ఓ మేజర్ అమరులయ్యారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. పౌరుల్ని మాత్రం భద్రతా సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.