ArticlesNews

వివాదాస్పద నినాదాలా? స్ఫూర్తిదాయక విధానాలా? ఏది అవసరం?

754views

భారత మీడియా సరికొత్త నినాదం “కరోనా కంటే ముందు ఆకలే మమ్మల్ని చంపేసేలా ఉంది”. ప్రస్తుత పరిస్థుతలను పరిశీలించే వారినెవరినైనా విస్మయపరచే మాట ఇది. అంతేకాదు భారత మీడియా బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ.

ఢిల్లీలోని వలస కార్మికులు కొందరు లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో తమకు పని, ఆదాయం లేదనే కారణంతో తమ తమ సొంత గ్రామాలకు వెళతామని బయలుదేరారు. వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా వీధుల్లోకి వచ్చి రకరకాల ప్రయాణ సాధనాల ద్వారాను, కొన్నిచోట్ల నడుచుకుంటూ కూడా తమ తమ రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి లాక్ డౌన్ అంటే అర్థం ఎక్కడివక్కడ, ఎక్కడివారక్కడ నిలిచిపోవాలని. లాక్ డౌన్ ఉద్దేశ్యానికి, స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్లు ఎందుకు వీధుల్లోకి వచ్చినట్టు? అసలు ఎవరు రానిచ్చినట్టు? ఎందుకు రానిచ్చినట్టు? మనిషికీ మనిషికీ దూరం పాటించాలని నిపుణులు మొత్తుకుంటూ ఉంటే ఇలా వేలాది మంది వీధుల్లోకి వచ్చేస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు బాధ్యులు ఎవరు? అలా బయటకొచ్చినవారెవరికీ బాధ్యత లేదా? భయం లేదా? ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సేవా సంస్థలు ఇలాంటి వారికి అవసరమైన వస్తువులను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి కదా? మరలాంటప్పుడు ఎక్కడున్నవారు అక్కడ కిమ్మనక కూర్చోకుండా ఇప్పుడీ యాత్రలు ఎందుకు మొదలెట్టినట్టు? వాళ్లని అందుకు ప్రేరేపిస్తున్నదెవరు? దీని వెనుక కుట్రకోణం ఉన్నదా?

అయితే… అసలు విచిత్రం ఏమిటంటే ఆ వలస కూలీల వద్దకు మైకులు, కెమెరాలు పట్టుకెళ్తున్న మీడియా ప్రతినిధుల మనస్సులలో ఇలాంటి ప్రశ్నలేవీ ఉత్పన్నం కాకపోవడం. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణానికి సిద్ధమైన ఆ అమాయకులకు వారు చేస్తున్న పని ఎంత ప్రమాదకరమో వివరించి చెప్పవలసిన మీడియా, వారిని, ఆ వార్తా ప్రసారాలు చూస్తున్న వారిని మరింత రెచ్చగొట్టేలా తమ తమ ప్రసార సాధనాలలో వార్తా ప్రసారాలు చేస్తూండడం అంతులేని ఆశ్చర్యాన్ని, అగ్రహాన్ని కలిగిస్తున్నది. వారి బాధ్యతా రాహిత్యం కారణంగా ఈ జాడ్యం దేశంలోని మిగతా ప్రధాన పట్టణాలు, నగరాలకు కూడా విస్తరించి, అక్కడి వలస కూలీలు కూడా మూటా ముల్లె సర్దుకుని బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

నిజానికి నాకనిపిస్తున్నదైతే ఒక వర్గం మీడియా ఉద్దేశ్య పూర్వకంగానే ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలను ప్రసారం చేస్తున్నదని. వలస కూలీల ప్రయాణాలను అరికట్టలేకపోతున్న భాజపాయేతర ప్రభుత్వాల అసమర్ధతను వెల్లడించకుండా, అటువంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లను వివరించకుండా నడిచిపోతున్న వారి వెంట పడి, వారు “కరోనా కంటే ముందు ఆకలితో చచ్చిపోయేట్టున్నారు” అంటూ తప్పుడు కూతలు కూస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి ఈ విషయంలో మన ప్రభుత్వాలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. కొంత వెనకా ముందూ కావొచ్చు కాదనను. కొంత ఇబ్బంది తప్పదు. కానీ దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ రేషన్ సరుకులు అందజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అందరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే భారీ ప్యాకేజి ప్రకటించింది.

నిజానికి ఎక్కడివాళ్ళు అక్కడుంటే సరిపోతుంది. అనేక సేవాసంస్థల వారు కూడా తమ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. ఏ ఇబ్బందీ లేకుండా ఉండొచ్చు. ఐనా కొందరు మా ఊరికెళ్ళాలంటూ మంకు పట్టు పట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలకు తలనొప్పులు సృష్టిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే. ఇంకా చెప్పాలంటే దేశద్రోహమే.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకేమీ బాధ్యత లేనట్లు చోద్యం చూస్తున్నాయ్. ఇలాంటి బాధ్యతా రాహిత్యం వల్ల ఎంత ముప్పున్నదో వివరించి చెప్పాల్సిన మీడియా ఆ వలస కూలీలకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు కట్టుకథలు ప్రసారం చేస్తోంది. ఇది భావోద్వేగాలకు సమయం కాదు. స్వార్థ రాజకీయాలకు సమయం కాదు.  ప్రతి ఒక్కరూ బాధ్యత ఎరిగి ప్రవర్తించవలసిన తరుణం. తమ బాధ్యతాయుత వర్తన ద్వారా, క్రమశిక్షణ ద్వారా, కట్టుబాటు ద్వారా మాత్రమే ఇప్పటి ఈ సంక్షోభాన్ని దేశం అధిగమించగలదు. లేకపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరైనా హద్దు మీరితే, గట్టు దాటితే…. వారెంతటి వారైనా, చివరికి ప్రసార మాధ్యమాలైనా సరే తిక్క తిక్క వేషాలేస్తే, వారి రహస్య అజెండాలను అమలు పరచడానికి ప్రస్తుత విపత్కర పరిస్థితులను వాడుకోజూస్తే ప్రభుత్వం కొరడా ఝళిపించాల్సిందే. కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిందే. గాడి తప్పిన పిల్లల్ని కఠినంగా క్రమశిక్షణలో పెట్టే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రను ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజా సంక్షేమార్థం ప్రభుత్వాలు అందిస్తున్న సాయాన్ని తమ నాయకత్వం యొక్క ఘనతగా ప్రచారం చేసుకునే ప్రయత్నాన్ని కూడా ఆయా పార్టీల కార్యకర్తలు మానుకోవాలి. ఎప్పటిలాగే అధికార పక్షం యొక్క ప్రతి నిర్ణయాన్నీ, చర్యనూ తప్పుబట్టే వైఖరిని కూడా ప్రతిపక్షాలు మానుకోవాలి. ఈ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి దేశాన్ని ఈ ఆపత్సమయంలో రక్షించుకోవడానికి అందరం సంఘటితంగా, సకారాత్మక దృష్టితో ఆలోచించి ముందడుగు వేయాల్సిన తరుణమిది.

కరోనా కాటుకు ప్రపంచమంతా కలవరిపడిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచమంతా భారతీయ జీవన విధానాన్ని ప్రశంసించి, అనుసరిస్తోంది. పెద్ద పెద్ద దేశాలకే మార్గదర్శకంగా నిలుస్తున్న మన ప్రభుత్వ చర్యలను యావత్ ప్రపంచం కొనియాడుతోంది. ఈ సమయంలో ఏ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమో ప్రయత్నించి దేశ ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నాలు ఎవ్వరూ చెయ్యకూడదు.. కాదని గీత దాటిన వారెవరైనా భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. జాగ్రత్త.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.