
కరోనా మహమ్మారి కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రత కోసమే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తిలేదని అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ”అంటువ్యాధుల చట్టం సవరణ ఆర్డినెన్స్-2020, కరోనా నియంత్రణకు దేశం కొనసాగిస్తున్న పోరులో ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ సవరణ వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తుంది. వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు” అని ప్రధాని తెలిపారు.
కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు కేంద్రం 1987 అంటువ్యాధుల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఎవరైనా వైద్య సిబ్బందిపై దాడి చేస్తే, వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి గరిష్ఠంగా ఏడెళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దాడి సమయంలో వైద్య సిబ్బంది వాహనాలు, ఆస్పత్రికి సంబంధించిన వస్తువులు ధ్వంసం చేస్తే మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి దానికి రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది.





