News

 మమతక్క జమానాలో నీరుగారుతున్న లాక్ డౌన్

1.1kviews

పశ్చిమ్‌ బంగాలో లాక్‌డౌన్‌ మెల్లమెల్లగా నీరుగారుతోందని కేంద్ర హోమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో నిత్యావసరం కాని దుకాణాలు సైతం తెరుస్తున్నారని పేర్కొంది. పోలీసులే స్వయంగా మత సమ్మేళనాలకు అనుమతి ఇస్తున్నారని వెల్లడించింది. లాక్‌డౌన్‌ అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ్‌బంగా డీజీపీ, ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖలు రాసింది. రాష్ట్రంలో కూరగాయలు, చేపలు, మాంసాహార మార్కెట్లలో నియంత్రణ లేదని, వ్యక్తిగత దూరం పాటించడం లేదని వెల్లడించింది. ‘పశ్చిమ్‌బంగాలో లాక్‌డౌన్‌ క్రమంగా నీరుగారుతోందని భద్రతా సంస్థల నుంచి నివేదికలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వమే చాలా మినహాయింపులు ఇస్తోంది. ఉదాహరణకు నిత్యావసరం కాని దుకాణాలు తెరుస్తున్నారు’ అని లేఖలో పేర్కొంది.

కోల్‌కతాలోని రజాబజార్‌, నార్కెల్‌ దంగా, తోప్సియా, మెటియాబర్జ్‌, గార్డెన్‌రీచ్‌, ఇక్బాల్‌పుర్‌, మనిక్‌టాలలో అసలు సామాజిక దూరం పాటించడం లేదని, నియంత్రణ కొరవడిందని కేంద్రం తెలిపింది. నార్కెల్‌ దంగా వంటి ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయని వివరించింది. ‘మత సమ్మేళనాలకు పోలీసులే అనుమతినిస్తున్నట్టు నివేదికలు అందాయి. ఉచిత రేషన్‌ సరుకులను ప్రభుత్వ వ్యవస్థీకృత పద్దతుల్లో కాకుండా రాజకీయ నాయకులు అందజేస్తున్నారు. ఇది కొవిడ్‌-19 వ్యాప్తికి కారకం అవుతుంది’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇలాంటి ఉల్లంఘనలకు అంటువ్యాధుల నియంత్రణ చట్టం, ఐపీసీ ప్రకారం శిక్షలు ఉంటాయని గుర్తుచేసింది. ‘కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వెంటనే కేంద్ర హోమంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలి’ అని కేంద్రం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.