
దేవదాసు నవల చివరిపుటలో శరత్ బాబు వ్రాసినమాట మరచిపోలేనిది. “దేవదాసు చావు లాంటి చావు పగవాడికి కూడావద్దు”. ఎందుకు వ్రాశాడీ మాట?
దేవదాసు ఒక పెద్ద జమీందారు కుమారుడు , విద్యాధికుడు. కాని అతడు చనిపోయిన సమయంలో నా అనుకునే వాళ్ళెవరూ దగ్గరలేరు. సేవలుచేసేవారు లేకపోవటమేకాదు , చివరిసారిగా చూసుకుని ఒక కన్నీటిబొట్టు కార్చినవారుగాని , రామ్ నామ్ సత్య హై అంటూ అంత్యక్రియలు చేసినవారు గానీ లేరు. బహుశా ఊరిచివరకు ఈడ్చి పడవేసిన శవాన్ని కాకులు ,గద్దలూ పీక్కొని తిని ఉంటాయి.
ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారితో ఆసుపత్రి సేవలు అవసరమయ్యే వారి సంఖ్య ఒక స్థాయిని దాటిపోతే ఎంత అభివృద్ధిచెందిన దేశాలైనా వారికి సదుపాయాలు సమకూర్చలేవు. రోగి ఎంత పలుకుబడి కలవాడైనా అతన్ని కనిపెట్టుకొని సేవలందించడానికి డాక్టర్లుగాని , నర్సులు గానీ అందుబాటులో ఉండరు. రోజూ వచ్చి పడేవారు వందలసంఖ్యలో ఉంటే అక్కడుండే నలుగురైదుగురు ఎంతని సేవచేయగలరు?ఆక్సిజన్ సిలిండర్ల కొఱత, వెంటిలేటర్ల కొఱత వెక్కిరిస్తుంటే వైరస్ బారిన పడినవారికి తమ స్వయంకృతాపరాధం తెలిసివస్తుంది. కానీ అప్పటికే ఆలస్యమైన ఆదశలో ఎంత చింతించినా, వగచినా అంతా నిష్ప్రయోజనమే.
చనిపోయిన వారి మతవిశ్వాసాలతో సంబంధంలేకుండా శవాలను గుట్టలుగా తగులబెట్టటం అనివార్యమౌతుందని వివిధ దేశాల అనుభవాలు తెలియజేస్తున్నవి.
అలెగ్జాండరు చనిపోయేముందు తన విశ్వాసపాత్రులైన సేవకులను ఒక కోరిక కోరాడట.
..ప్రపంచవిజేత కాగోరిన అలెగ్జాండరు వట్టిచేతులతోనే ఈ ప్రపంచాన్ని వదిలి పోయాడని తెలపడానికి వీలుగా రెండు చేతులూ శవపేటికలోనుండి బయటే ఉండేటట్లుగా ఏర్పాటు చేయండని. అతని కోరిక నెరవేరి ఉంటుంది. కాగా ఇప్పు డీ మహమ్మారి బారిన పడి చనిపోయేవారు సంపదలను కాదుగదా , తమ మతాచారాలప్రకారం అంత్యక్రియలకైనా నోచుకుంటారా..అన్నదీ అనుమానమే.
ఇంతటి భయంకర స్థితి పొంచిఉన్నదని ఇతరదేశాల అనుభవాలు హెచ్చరిస్తూ ఉండగా ఈ వైరస్ ను మరికొందరికి అంటించిపోవాలని ఎవరైనా కోరుకోగలరని ఊహించగలమా?
మరి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నతీరు, కొందరు జనసముదాయాలవారూ వ్యవహరిస్తున్నతీరు ఎలాఉంది? ప్రమాదవశాత్తు ఒకరినుండి మరొకరికి అంటుకొనే లక్షణం గల ఈ మహమ్మారి ఎంతదూరం విస్తరిస్తుందో , ఎన్ని వందల వేల లక్షలమందిని పొట్టన పెట్టుకొంటుందో , ఏమి చేస్తే శాంతిస్తుందో అంచనా వేయటం ఎవరికైనా సాధ్యమౌతుందా?
ఇటువంటి విపత్కర పరిస్థితుల మధ్య మనం చేయగలిగింది ఒక్కటే. ఒక్కవ్యక్తికైనా ఈ మహమ్మారి సోకడానికి పొరపాటున కూడా నేను కారణం కారాదు అన్న స్పృహతో అన్ని విధాల జాగ్రతలు తీసుకోవటం. ఎంత ఇబ్బంది అయినా ఓర్చుకొని ఒకరికొకరు ఎడంగా ఉండితీరాలనే నియమాన్ని నిష్ఠగా పాటించటం. మనం ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా మనవాళ్ళను వందల సంఖ్యలోనో వేలసంఖ్యలోనే కాటువేస్తుందని తెలుసుకుని మసలుకోవటం.
ప్రభుత్వాలు కఠోరమైన నియమాలతో లాక్ డౌన్ విధించిన సమయంలో బే ఫర్వా గా వ్యవహరించటమంటే పొరుగువాని ఇంట్లో పది విస్తళ్ళులేచిందే చాలనుకొనే కొంచెపు బుద్ధితో మన ఇంటికే నిప్పు పెట్టుకోవటమే. “పెక్కుభంగులు వివేక భ్రష్ఠ సంపాతముల్” అని భర్తృహరి చెప్పినమాటను గుర్తుచేసుకొని మనం వివేక శీలురమై మెలగవలసిన సమయమిది.
– డా|| వడ్డి విజయసారధి





