News

బిడ్డ పుట్టినా చూడలేక…

681views

చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ క్రమక్రమంగా విజృంభిస్తోంది. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ లాక్‌డౌన్‌ అమలును పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు బయట తిరగకుండా పగలూ రాత్రి తేడా లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ప్రజల కోసమే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు తమకు బిడ్డ పుట్టినా వెళ్లలేక పోయారు. కార్యాలయంలోనే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆ సంతోషాన్ని ఇతర సిబ్బందితో పంచుకున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అవినాష్‌, నరేష్‌ కుమార్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 5న నరేశ్‌ కుమార్‌ భార్య హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అవినాష్‌ భార్య కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ ఆస్పత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వీరిద్దరూ తమ భార్య, పిల్లల్ని చూడలేకపోయారు. వీడియో కాల్‌లో మాత్రమే చూసి మురిసిపోయారు. బిడ్డ పుట్టిన సంతోషాన్ని కార్యాలయంలోనే సిబ్బందికి మిఠాయిలు పంచి.. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పోలీసులపైనా ఉందని.. అయినా ప్రజల కోసమే వారంతా కష్టపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.