
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ యావత్ జాతి ఒక్కటైంది. సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దీపాల వెలుగులు ప్రసరించాయి. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల వరకు దీన్ని కొనసాగించారు. ఇళ్లలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీపపు ప్రమిదలు, టార్చి లైట్ల వెలుతురులో ప్రజలంతా కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రతినబూనారు. అన్ని రాష్ట్రాల్లో సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖలు సైతం దీనిలో పాలుపంచుకున్నారు. డిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్‌తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు తమ నివాసాల వద్ద కొవ్వొత్తులు వెలిగించారు.













