
718views
కశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతి చెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో బత్‌పురా వద్ద నిన్న నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇవాళ ఉదయం కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. కెరాన్ సెక్టార్ వద్ద నియంత్రణరేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను గుర్తించిన సైనికులు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ సమీపంలో ముష్కరులు దాగి ఉన్నారేమోనన్న అనుమానంతో కూంబింగ్ కొనసాగుతోంది.





