News

పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం

941views

సుదీర్ఘ  కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మకుమారి చీఫ్ రాజ్యోగిని దాది జానకి 104 సంవత్సరాల వయసులో తన మర్త్య చట్రాన్ని విడిచిపెట్టి దేహ ముక్తులైనారు.

బ్రహ్మకుమారి సంస్థాన్ మహిళలు నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దాని ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద ఉంది.

మౌంట్ అబూలోని ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దాది జానకి తుది శ్వాస విడిచారు. గత రెండు నెలలుగా ఆమె శ్వాసకోశ మరియు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు బ్రహ్మకుమారి సంస్థాన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలోని శాంతి వాన్ క్యాంపస్‌లో ఉన్న మైదానంలో ఆమె అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయి.

ఆమె మరణానికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ జానకి దాదీ సమాజానికి శ్రద్ధగా సేవ చేశారని కొనియాడారు. ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆమె కృషి చేశారని, మహిళల సాధికారత కోసం ఆమె చేసిన ప్రయత్నాలు గమనార్హమని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని “ఈ విషాదకరమైన ఘడియలలో నా ఆలోచనలన్నీ ఆమె యొక్క లెక్కలేనంత మంది అనుచరుల ఆవేదన గురించే. ఓం శాంతి,” అని వ్రాశారు.

రాజ్యోగిని దాది జానకి జనవరి 1, 1916 న అప్పటి సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ లో అంటే ప్రస్తుత పాకిస్థాన్ లో జన్మించారు. ఆమె 21 సంవత్సరాల వయస్సులో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు.

ఆమె 1970 లలో పాశ్చాత్య దేశాలలో పర్యటించారు. ప్రపంచంలోని 140 దేశాలను సందర్శించారు. ఆ దేశాలలో ఆమె అనేక ‘సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేశారు. అలాంటి 8000 కేంద్రాలకు మహిళలనే చీఫ్ అడ్మినిస్ట్రేటర్లుగా నియమించారు.

పరిశుభ్రతను కాపాడుకునే విషయంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను స్వచ్ఛ భారత్ అభియాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

Source : News Bharathi.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.