News

అయోధ్యలో పవిత్ర సరయూ నదిలో మాంసం, మద్యం సేవించిన ముగ్గురు అరెస్ట్

40views

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రంగా భావించే సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద పడవలో కూర్చుని మాంసం, మద్యం సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంటోన్మెంట్ (కాంట్) పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టైన వారిని లవ్-కుశ్ నిషాద్, రాజ్‌కుమార్ నిషాద్, జితేంద్ర నిషాద్ గా  గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక సాధువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర సరయూ నది పవిత్రతను భంగపరిచే చర్యలను సహించబోమని పేర్కొన్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

హిందూ విశ్వాసాల ప్రకారం, గుప్తార్ ఘాట్ వద్దే శ్రీరాముడు తన భూలోక అవతార లీలలను ముగించారని భావిస్తారు. అందువల్ల ఈ ప్రాంతం హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, సరయూ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

గతంలోనూ ఇలాంటి ఘటన

గత ఏడాది అయోధ్యలోని రామ్ కీ పైడీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఆ సందర్భంలోనూ పోలీసులు జోక్యం చేసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు, పవిత్ర క్షేత్రాల్లో శాంతి భద్రతలు, పవిత్రత పరిరక్షణకు చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రస్తుత ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.