News

తుపాకి ఎక్కుపెట్టినోడు చిక్కిపోయాడు

1.1kviews

శాన్య ఢిల్లీ ఘటనల్లో తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కరవల్‌ నగర్‌కు చెందిన షారుఖ్ గా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు విభాగం అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

”జఫ్రాబాద్ ప్రాంతంలో ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆందోళకారుల మధ్య నుంచి వచ్చి ప్రత్యర్థి వర్గంపై కాల్పులు జరిపాడు. అనంతరం తిరిగి గుంపులో కలిసిపోయాడు. ఈ క్రమంలో అతణ్ని నిలువరించేందుకు యత్నించిన పోలీసుపై తుపాకీ గురిపెట్టి బెదిరించాడు” అని ప్రత్యక్ష సాక్షులు తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలు, టీవీల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు యూపీ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు చిక్కాడు. నిందితుణ్ని అరెస్టు చేసినట్లు గత వారం రోజుల్లో పలుసార్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, పోలీసులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

ఢిల్లీలో వారం క్రితం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో 46 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.