
మెరుపుదాడులు, బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. సైనికులపై దాడికి ప్రతీకారంగా శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించామన్నారు. కోల్‌కతా సమీపంలోని రాజార్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ నూతన కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తూ ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మానేసర్, హైదరాబాద్, చెన్నై, ముంబయిలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని కూడా కోల్‌కతా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎన్‌ఎస్‌జీని మరింత బలోపేతం చేసేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీ షా హామీ ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఎన్‌ఎస్‌జీని నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సంవత్సరంలో 100 రోజులు సైనికులు వారి కుటుంబంతో కలిసి ఉండేలా ఓ విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని శ్రీ షా పేర్కొన్నారు.





