News

పశ్చిమాసియా ప్రభావం భారత్‌పై పరిమితమే

61views

విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, ఆర్థిక వెసులుబాటు, తక్కువ ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని తట్టుకునే స్థాయిలో భారతదేశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచిన ఒక రోజు తర్వాత, ప్రపంచ బ్యాంక్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య సంక్షోభాన్ని భారత్‌ సమర్ధంగా ఎదుర్కొందని, చమురు మార్కెట్లలో అస్థిరతకు దారితీసిన ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.

‘భారతదేశానికి స్థిర విధానాలు, అధిక విదేశీ మారకపు నిల్వలు, అవసరమైనప్పుడు మద్దతు అందించగలిగే ఆర్థిక వెసులుబాటు, తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నాయి. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), కొత్త కార్మిక విధానం వంటి స్థూల సానుకూల విధానాలు బలమైన వృద్ధి వేగానికి మద్దతు ఇస్తున్నాయి. అందుకే ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌ బలమైన, స్థూల పని తీరు కనబరిచే ప్రాంతంగా కొనసాగుతుందని మేము భావిస్తున్నామ’ని ప్రపంచ బ్యాంక్‌ రీజినల్‌ ప్రాక్టీస్‌ డైరెక్టర్, ప్రాస్పెరిటీ, ఫర్‌ సౌత్‌ ఏషియా – సెబాస్టియన్‌ ఎకార్డ్‌ వెల్లడించారు.

‘సౌత్‌ ఏషియా ఎకనామిక్‌ అప్‌డేట్‌’ పేరుతో ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బలమైన దేశీయ గిరాకీ, ఎగుమతుల కారణంగా భారత వృద్ధి 2024-25లో 7.1% కాగా, 2025-26లో 7.6 శాతానికి చేరింది. 2026-27లో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసినా, ఇది జనవరిలో విడుదల చేసిన ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌’ నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంది.