
దేవతా మూర్తులకు స్నాన, అలంకార, నైవేద్య సమయాల్లో ఎవరూ దర్శించుకోవడానికి వీలు లేకుండా తెర వేయడం మనందరికీ తెలిసిందే. ఈ ఆచారం అన్ని దేవాలయాల్లోనూ ఉంటుంది. ఇలా అడ్డుగా తెర ఎందుకు వేస్తారు, దాని వెనుక దాగున్న అర్థం ఏమిటి? తెర ఉన్నప్పుడు భక్తులు ఏ నియమాలు పాటించాలి.. అనే సందేహం కలుగుతుంటుంది. స్వామివారు కనిపించకుండా తెర దించిన సమయంలో భక్తులు గుడిలో తిరగకూడదు, ప్రదక్షిణ చేయకూడదు. ఆలయంలో ఒకచోట కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. తెరను తొలగించిన వెంటనే స్వామివారిని దర్శించుకోవాలి. దీనికి సంబంధించిన ఒక ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం..
ఒకసారి త్యాగరాజ స్వామి ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు. అప్పుడు తెర వేసి ఉంది. ఆయన ఆ సమయాన్ని వినియోగించుకుని.. అప్పటికప్పుడు ‘తెర తీయరా.. తిరుమల దేవరా’ అనే అద్భుత కీర్తనను ఆశువుగా ఆలపించారు. ‘నా హృదయంలో అహంకారం అనే తెర ఉంది. అది నాలో ఉన్న దైవత్వాన్ని కప్పి ఉంచుతోంది. ఆ తెర తొలగినప్పుడే నేను దేవుణ్ణి చూడగలను’ అనేది భావం. హృదయంలో కొలువైన దేవుడికి మనలోని అహంకారమనే తెర అడ్డుగా నిలిస్తే.. ఇక ఆ పరమాత్ముడు మనకు కనిపించడు అనేది ఇందులోని అంతరార్థం. అన్నమయ్య కూడా అహాన్ని ‘పన్నగపు తెర’ అని సంబోధించి మనలోని అహాన్ని విషసర్పంతో పోల్చిన సంగతి గమనించదగినది. గర్భగుడిలో వేసిన తెర వల్ల గుడిలో దేవుడు కనిపించడు. అయితే.. అలా తెర దించిన సమయంలో ధ్యానముద్రలో కూర్చుని దైవాన్ని స్మరిస్తుంటే.. అటు మనసు తెర, ఇటు ఆలయ తెర.. రెండూ తెరుచుకుంటాయి.
-డా.జయదేవ్ చల్లా





