రామాలయ సందర్శనకు వెళ్లిన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో పవిత్రమైన రామాలయ సందర్శనకు వెళ్లిన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ శ్రీరామనవమి నాడు ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రామాలయాన్ని సందర్శించి పర్యటన అనంతరం కార్యకర్తలపై భౌతిక దాడులు చేయటం తీవ్ర విచారకరమన్నారు.
పెదపేట రామాలయం స్థలం ఏమాత్రం వివాదాస్పదం కాదని, అక్కడ ఎప్పటి నుంచో ఆలయం, రాముని విగ్రహాలు ఉన్నాయని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో కొందరు మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన అక్కడ పూర్వం నుంచి ఉన్న ఆలయ చరిత్ర, పవిత్రత, సంస్కృతి ఏమాత్రం మారవు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో హిందువులుగా ఉండి మత మార్పిడి చేసుకున్న వారు ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదని, మత మార్పిడి చేసుకున్న వారు ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించడానికి అనర్హులని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.





