
గుంటూరు నగర వీధుల్లో శ్రీరామనవమి శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. శ్రీ రామనవమి పండుగ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న యాత్ర ఈ ఏడాది శుక్రవారం కూడా కొనసాగింది. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినదించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైన శోభాయాత్రను కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథంలో వేంచేసిన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వార్లను దర్శించుకున్నారు. భక్తి గీతాలతో సందడి చేస్తూ వాహనాలపై ముందుకు కదిలారు. శ్రీరాముని భారీ ప్రతిమ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు యాత్రకు హాజరయ్యారు.
ముఖ్యఅతిథిగా తాళ్ల్లాయ్యపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. శివస్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా హిందూవులు ఏకం కావాలని అన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా శోభాయాత్రను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు.
శ్రీరామ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు కారంశెట్టి లోకేష్‌గుప్త యాత్ర విశేషాలను వివరించారు. శ్రీవెంకటేశ్వర దేవస్థానం వద్ద శోభాయాత్ర మొదలైంది. కుందల రోడ్డు మీదుగా పట్టాభిపురం, కంకరగుంట రైల్వే ఓవర్‌బ్రిడ్జి, నగరంపాలెం, హనుమాన్ సెంటర్, బస్టాండ్, పాతగుంటూరు, పట్నంబజార్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వైపుగా సంపత్‌నగర్ శ్రీరామనామ క్షేత్రం వద్ద ముగిసింది.





