News

అమెరికా మ్యూజియంలో తమిళనాడు విగ్రహాలు

72views

తమిళనాడు నుంచి అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లిన విగ్రహాలు తిరిగి రానున్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్‌ నేషనల్‌ మ్యూజియంలో మూడు పురాతన విగ్రహాలు భారతీయ శిల్పాలను పోలి ఉండగా వాటిని తమిళనాడులోని దేవాలయాల నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు నిర్ధారణ అయింది. వాటిని తిరిగిచ్చేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయ డిప్యూటీ అంబాసిడర్‌ నామ్యా కంబా, స్మిత్సోనియన్‌ మ్యూజియం డైరెక్టర్‌ చేజ్‌ రాబిన్సన్‌తో ఒప్పందంపై సంతకం చేశారు. 9వ శతాబ్దంనాటి నటరాజ కాంస్య విగ్రహం, 12వ శతాబ్దానికి చెందిన ఉమా మహేశ్వర శిల్పం, 16వ శతాబ్దం నాటి సుందరమూర్తి నాయనార్‌-పరవై నాచియార్‌ శిల్పాలను తిరిగి తీసుకురానున్నారు.

విగ్రహాలను భారత్‌ నుంచి అమెరికాకు అక్రమంగా తరలించినట్లు నిర్ధారణ అయిందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రకటించింది. కళ్లకురిచ్చి వీరచోళపురం గ్రామంలోని శివాలయంలో సుందరమూర్తి నాయనార్‌-పరవై నాచ్చియార్‌ విగ్రహం ప్రతిష్ఠితమైనట్లు 1956లో తీసిన ఫొటో ద్వారా నిర్ధారితమైంది. మన్నార్‌కుడి ఆలందూర్‌ గ్రామం విశ్వనాథర్‌ ఆలయంలో ఉమామహేశ్వర విగ్రహం 1959లో తీసిన ఫొటోలో ఉంది. తంజావూర్‌ జిల్లా తిరుత్తురైపూండి తాలూకాలోని శ్రీభవ ఔషధేశ్వర ఆలయంలోని నటరాజ విగ్రహం ఫొటోను 1957లో తీసినట్లు పేర్కొంది.