News

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

78views

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను శుక్రవారం తయారు చేశారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న తితిదే యాత్రికుల వసతి సముదాయం భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బియ్యం, పసుపు, కుంకుమ, నెయ్యి కలిపి అక్షింతలను తయారు చేశారు. ప్రత్యేకంగా ముద్రించిన చిరు సంచిలో ఒక ముత్యం, రెండు చెంచాల అంక్షితలు, కంకణం వేసి నింపారు. తొలిరోజు 90 వేల ప్యాకెట్లు సిద్ధం చేశారు. మరో 80 వేల ప్యాకెట్లు శని, ఆదివారాల్లో తయారు చేస్తామని డీఈ హర్షవర్ధన్‌రెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి పోటు నుంచి 70 వేలకు పైగా లడ్డూలు రానున్నాయి. అవి రాగానే సంచిలో నింపుతారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు అందజేశారు. వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి 600 మందికి పైగా శ్రీవారి సేవకులు హాజరయ్యారు. డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, ఏఈవో బాలరాజు, డీఈలు హర్షవర్ధన్‌రెడ్డి, సరస్వతి, బాధ్య పీఆర్వో నీలిమ పాల్గొన్నారు.