
ఏ పని చేయాలన్నా కావాల్సింది ఆరోగ్యకరమైన దేహం. మనసు, శరీరం రెండూ బాగుంటేనే మనిషిలో ఉత్సాహం, చైతన్యం పరవళ్లు తొక్కుతుంటాయి. అందుకే ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు మన పూర్వీకులు. పూజావిధానంలో కూడా దేహం ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. దైవానికి చేసే అథాంగ పూజను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఏ పూజనైనా ఆచమనీయం, ఆత్మశుద్ధి, భూశుద్ధి ఆ తరవాత సంకల్పంతో ప్రారంభిస్తాం. ముకుళిత హస్తాలతో దైవాన్ని ఆహ్వానించి, ఆసనంపై ఆశీనులను చేసిన తరవాత పాద్యం, అర్ఘ్యం ఇత్యాది షోడశ ఉపచారాలు సమర్పిస్తాం. ఆపై అథాంగ పూజ ఆరంభిస్తాం. ‘అథాంగ పూజ’ అంటే దైవం పాదాల దగ్గర నుంచి ఆరంభించి శిరస్సు దాకా అర్చించడం. దేహంలోని ప్రతి అవయవం ముఖ్యమైనదేననీ, అన్నిటినీ గౌరవించాలనీ చెప్పడమే ఈ పూజావిధానం ప్రధానోద్దేశం. కానీ అంత ఓపికా తీరికా లేని నేటి మనిషి దేవుడి గురించి కాదు కదా, తన గురించి తాను పట్టించుకునే పరిస్థితిలో కూడా లేడు. అదే బాధాకరం!
వేదాంతులు, రుషులు కూడా సాధన కోసం ‘దేహం’ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరమని ఉద్భోదించారు. నాటి మనుషుల జీవన విధానం ప్రకృతి నియమాలను అనుసరిస్తూ సాగేది. రాత్రులు విశ్రాంతికి, పగలు కష్టించి పనిచేయడానికి కేటాయించేవారు. అలాంటిది శాస్త్ర సాంకేతిక అభివృద్ధీ తదనుగుణంగా పెరిగిన జనాభా కలిసి మొత్తంగా మనిషి జీవనశైలినీ జీవగడియారాన్నీ కూడా మార్చేశాయి. దీని ప్రభావం అన్నింటి మీదా కనిపిస్తోంది. ఆహారపుటలవాట్లు మారిపోయాయి. సౌకర్యాలు పెరిగాయి. వ్యాయామం తగ్గిపోయింది. ఒత్తిడి, ఆందోళన జీవితంలో విడదీయలేని భాగాలయ్యాయి. ఫలితంగా వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మంచి అలవాట్లను అవలంబించడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది.
ఈ సవాలును ఎదుర్కొని నిలబడాలంటే దేహంపై ధ్యాస పెంచాలి. దీనికి శరీరాన్ని పూజించడమే మార్గం. ఇక్కడ పూజించడమంటే గౌరవించడమని అర్థం. ఆ పరమాత్ముడి ఆరాధనకే సమయం కేటాయించలేక మొక్కుబడిగా దీపం పెట్టో, దణ్నం పెట్టుకునో పని కానిస్తున్న మనిషి ఇక తనను తాను ఎప్పుడు పట్టించుకుంటాడు? నిజానికి ఈ జీవితానికి ఆలంబన అయిన దేహాన్ని అభిమానించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. మనసును కేంద్రీకరించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలసట తీరి, తనువూ మనసు తేజోవంతమవుతాయి. పరమాత్మ సేవకు పూర్తిస్థాయిలో సహకరిస్తాయి. ‘దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవస్సనాతనః’… దేహమే దేవాలయం. ఆ శరీరంలో ఉన్న జీవుడే దేవుడు. మరి అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమూ సాధనలో భాగమే కదా!





