News

USCRF నివేదికను రూపొందించిన వారి నేపథ్యాన్ని చెప్పండి : భారతీయ మేధావుల డిమాండ్

102views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్ (USCRF) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సుపై భారతీయ మేధావులు తీవ్రంగా ఖండించారు. ఇందులో మొత్తం 275 మంది వుండగా.. 25 మంది మాజీ న్యాయమూర్తులు, పది మంది మాజీ రాయబారులు, 119 మాజీ ప్రభుత్వ అధికారులు,131 మంది పదవీ విరమణ చేసిన సైనికాధికారులు ఇందులో వున్నారు. ఈ నివేదిక తీవ్ర దురుద్దేశమైందని, మేధోపరంగా దివాళా తీసిన నివేదిక అని, వికృతమైన లెక్కల నివేదిక అంటూ విరుచుకుపడ్డారు.

ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. భారతీయుల మదిలో సంఘ్ పై వున్న పూజ్య భావనను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ నివేదిక వుందని, USCRF నివేదిక తీవ్ర పక్షపాత, నిలకడ లేని నివేదిక అని, అసలు ఈ డిమాండ్ ను తీసుకొచ్చిన వారందరి నేపథ్యాన్ని కూడా ఓసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేధావులు ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆస్తులను స్తంభింపజేయడం, భారతీయ పౌరుల రాకపోకలను పరిమితం చేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్నవారిపై ఆంక్షలు విధించడం వంటి యూఎస్‌సీఆర్‌ఎఫ్‌ సిఫార్సులు తీవ్ర దురుద్దేశపూరితమైనవి ఆక్షేపించారు.

“యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లోని ఆరుగురు కమిషనర్లందరినీ అమెరికా ప్రభుత్వమే నియమిస్తుంది. వీరికి యూఎస్ కాంగ్రెస్ ద్వారా అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు సమకూరుతాయి. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లో ఈ నివేదికకు సహకరించిన వారందరి నేపథ్యాలను కఠినంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము” అని కోరారు.

అవసరమైన వివరణ లేకుండా, సందర్భం లేకుండా ఆరెస్సెస్ వంటి జాతీయవాద సంస్థలను, సామాజిక సాంస్కృతిక సంస్థ విషయంలో ప్రతికూల దృక్పథాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, “తరచుగా సరైన స్థూల-స్థాయి ఆధారాలు లేకుండా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంటి భారతీయ సంస్థలను, సామాజిక-సాంస్కృతిక సంస్థలను అత్యంత ప్రతికూల కోణంలో చిత్రీకరించే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ పునరావృత ధోరణిని ఇది చూపిస్తుంది” అని ధ్వజమెత్తారు.

“భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. పటిష్టమైన, కాలపరీక్షకు నిలిచిన న్యాయవ్యవస్థ, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సంస్థలు, పార్లమెంటరీ పర్యవేక్షణ ఉన్నందున, ఒకరి మతపరమైన హక్కులను ఉల్లంఘించిన తర్వాత వ్యక్తులు లేదా సంస్థలు శిక్ష నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది,” అని సంతకాలు చేసినవారు స్పష్టం చేశారు.