
కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలలో సామాజిక సమరసతా వేదిక వారు గ్రామ గ్రామాన భగవద్గీత సందేశాన్ని ప్రజలకు, భక్తులకు వినిపించాలని సంకల్పించారు.
కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి, భవిష్యత్తును గురించి కలలు కనే వారికి, లక్ష్య సాధనకై ప్రయత్నించే వారికి ఇలా ప్రతి ఒక్కరికి భగవద్గీత సారాంశం ఉపయోగపడుతుంది అని నిర్వాహకులు తెలిపారు.

డాక్టర్ డేవిడ్ ఫ్రాలే చెప్పినట్లుగా హిందూ ధర్మం గురించి హిందువులే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, హిందూ ధర్మంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సరైన రీతిలో అడ్డుకోలేకున్నారని ధర్మ ప్రచారక్ శ్రీ బొడ్డు పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాక హిందూ మతాన్ని హిందువులే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఇతర మతాలు కూడా హిందూమతం వంటివే అనే అపోహకు లోనవుతున్నారని తెలిపారు. అలాగే కొందరు “అన్ని మతాల ఉపదేశము ఒక్కటే” అని పేర్కొంటున్నారని, ఇదో పెద్ద అబద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మన ధర్మాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నదని, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నమే ఈ కార్యక్రమాలని ఆయన పేర్కొన్నారు.

22/2/2020 శనివారం ఉదయం 9 గంటలకు స్తానిక హిందూ కళాశాల ఎదురుగా ఉన్న మహతి కళావేదికలో సమీప గ్రామాల నుంచి విచ్చేసిన భజన బృందాలతో సమావేశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూమత బాల సమాజం కార్యదర్శి శ్రీ సింగరాజు గోవర్ధన్ అధ్యక్షత వహిస్తారని, హైదరాబాదుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి భాస్కర రాజు, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ కిల్లి భాస్కరరావు, క్రైస్తవ తత్వశాస్త్ర పరిశోధకులు శ్రీమతి ఎస్తేరు ధనరాజ్ లు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

అదే రోజు సాయంత్రం 5 గంటలకి తరకటూరులోని చెన్నకేశవ కళ్యాణ వేదిక నందు కూడా ఇలాంటి సమావేశమే జరగనున్నదని నిర్వాహకులు తెలిపారు. శ్రీ జక్కా ధర్మారావు నాయుడు అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి వి ఎస్ నాయుడు, ప్రధాన వక్తగా హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ తత్వశాస్త్ర పరిశోధకురాలు శ్రీమతి ఎస్తేరు ధనరాజు గారు విచ్చేస్తారని వారు తెలిపారు.
అనంతరం ఆ రోజు సాయంత్రం తరకటూరు, మొవ్వ, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామాలలో భగవద్గీత సందేశాన్ని వినిపిస్తామని ధర్మ ప్రచారక్ శ్రీ బొడ్డు పరశురాం తెలిపారు.

అలాగే 23వ తేదీ ఆదివారం గిలకలదిండి, బందరు కోట, గాదే పూడి, వడ్లమన్నాడు, చేవెండ్ర గ్రామాలలో గీతా సందేశాన్ని వినిపించడంతో పాటు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సమీప గ్రామాల అర్చకులు, పురోహితులతో సమావేశాన్ని నిర్వహిస్తామని, అనంతరం పల్లె తుమ్మలపాలెం, పాతేరు గ్రామాలలో పర్యటిస్తానని తెలిపారు.
చివరిగా 24వ తేదీ సోమవారం ఉదయం రుద్రవరం, పెడన, హుస్సేన్ పాలెం గ్రామాలలోనూ సాయంత్రం చిన్నాపురం గ్రామంలోనూ తమ సందేశాన్ని వినిపిస్తామని శ్రీ పరశురాం తెలిపారు.
ఈ కార్యక్రమాలలో ప్రముఖ రచయిత, విశ్రాంత కళాశాల అధ్యాపకులు డాక్టర్ బి సారంగపాణి, హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు శ్రీమతి ఎస్తేరు ధనరాజ్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వి భాస్కర్ రాజు మరియు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు శ్రీ కిల్లి భాస్కరరావులు పాల్గొని ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలియజేశారు.





