
భారత్ వేగంగా ఆధునిక యుద్ధ సామగ్రిని సమకూర్చుకొనే దిశగా సాగుతోంది. ఈ క్రమంలో సైలెంట్ కిల్లర్లుగా పేరున్న సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకొనే పనివేగంగా చేపడుతోంది. సబ్‌మెరైన్లు భారీ సంఖ్యలో ఉన్న దేశంతో యుద్ధానికి చాలా దేశాలు భయపడతాయి. తాజాగా భారత్ సబ్‌మెరైన్ల నుంచి దాడి చేయగల కె-4,కె-5 క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఇప్పుడు సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచే పనిలో పడింది. ఇప్పటికే భారత్ పలు మోడళ్ల డీజిల్ సబ్‌మెరైన్లు ఉన్నా.. అవి అణుశక్తి జలాంతర్గాములతో పోటీ పడలేవు. భారత్ వద్ద ఐఎన్‌ఎస్ చక్ర, ఐఎన్‌ఎస్ అరిహంత్ మాత్రమే అణుశక్తి జలాంతర్గాములు ఉన్నాయి. ఇవి చాలా నిశ్శబ్దంగా తమకు అప్పగించిన పనిని ముగించేస్తాయి. దాదాపు ఏడాది క్రితం డెటరెన్స్ పెట్రోల్‌ను కూడా నిర్వహించాయి. అంటే వీటి ద్వారా అణు దాడి కూడా చేయవచ్చన్న మాట.
భారత్ ఇప్పుడు అణుశక్తితో నడిచే సబ్‌మెరైన్లను పెంచుకోవాలని భావిస్తోంది. మరోపక్క చైనా భారీ సంఖ్యలో సముద్ర బలగాన్ని పెంచుకోవడంతో ఇప్పుడు భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.1.2లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన పని చురుగ్గా జరుగుతోంది. మొత్తం ఆరు అణుశక్తి సబ్‌మెరైన్లను ఈ ప్రాజెక్టు కింద నిర్మించనున్నారు.
క్షిపణలు, టార్పెడోలను ప్రయోగించేందుకు వీలుగా వీటిని సిద్ధం చేసే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే మరో పదేళ్లలో ఈ ప్రాజెక్టులోని తొలి సబ్‌మెరైన్ సేవలకు సిద్ధమైపోతుంది.
ప్రాథమికంగా డిజైన్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇక అడ్వాన్స్ స్టేజి పనులు మొదలు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్, డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ రంగ లోహసంస్థలు ఈ సబ్‌మెరైన్ల కోసం ప్రత్యేకమైన లోహ సమ్మేళనాలను సిద్ధం చేయడంలో పురోగతి సాధించాయి. ప్రస్తుతం వీటి పరీక్షలు జరుగుతున్నాయి.
సిద్ధమవుతున్న అరిఘాత్
ఐఎన్‌ఎస్ అరిహంత్ శ్రేణిలో అరిఘాత్ పేరుతో నిర్మిస్తున్న సబ్‌మెరైన్ ఈ ఏడాది సేవల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాతో 2024 తర్వాత మరో రెండు సేవలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఈ మధ్య భారత్ అవసరాలు తీర్చేందుకు మరో సబ్‌మెరైన్‌ను రష్యా నుంచి లీజుకు తీసుకురాన్నారు. దీనిలో భారత కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఈ డీల్ విలువ 3 బిలియన్ డాలర్లు.
అణుశక్తి సబ్‌మెరైన్లు ఎందుకంటే..
కొన్ని సందర్భాల్లో సముద్ర జలాల్లో నిఘా.. వ్యూహాల అమలుకు కొన్ని నెలలు కూడా నీటిలో ఉండాల్సి ఉంటుంది. డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్లు అయితే ఇంధనం నింపుకోవడానికి వెంటనే నీటిపైకి రావాల్సి ఉంటుంది. కానీ, అణుశక్తి సబ్‌మెరైన్లలో చిన్న రియాక్టురు అవసరమైన చోదకశక్తిని అందిస్తాయి. దీంతో కొన్ని నెలలలు నీటి అడుగున ఉండే అవకాశం ఉంది. అందుకే అమెరికా నావికాదళం 55 సబ్‌మెరైన్లను వినియోగిస్తుండగా.. చైనా 10 వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా వీటి సంఖ్యను పెంచుకోవాలనుకుంటోంది.





