
( ఫిబ్రవరి 29 – గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతి )
దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ అనే పేరు వ్యాప్తిలోనికి రావడానికి కారణం గాడిచెర్ల వారే. దత్త మండలాలు అనే పేరు బానిసత్వానికి చిహ్నంగా వుందని, ఈ ప్రాంతప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రాయలు ఏలిన సీమ కాబట్టి దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని 1928లో సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతలో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రతిపాదించాడు. అప్పటినుంచీ ఈ ప్రాంతాన్ని రాయలసీమ అనే పేరుతో పిలవడం మొదలై అది బహుళవ్యాప్తి చెంది ఆఖరికి స్థిరపడింది.
గాడిచెర్లవారు 1883 సెప్టెంబర్ 14వ తేదీన భగీరధమ్మ, శ్రీ వెంకటరావు దంపతులకు కర్నూలులో జన్మించారు. వీరి తండ్రి రెవెన్యూ ఇన్స్పెక్టరుగా పని చేసేవారు. గాడిచెర్ల వారు కంభంలో ప్రాథమిక విద్యను, కర్నూలు మున్సిపల్ హైస్కూల్ మరియు గుంతకల్లులో హైస్కూల్ చదువును పూర్తి చేశారు. మద్రాస్ కళాశాలలో బి.ఎ., ఎం.ఎ. పూర్తి చేశారు. 1907లో వీరు రాజమండ్రిలోని టీచర్ ట్రైనింగ్ కళాశాలలో చదువుతుండగా స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించారు.
బ్రిటిష్ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య గొడవలు పెంచి విభజించి పాలించే కుట్రలో భాగంగా పశ్చిమ బెంగాలు రెండు ముక్కలుగా విడదీసింది. కానీ దానిని వ్యతిరేకిస్తూ దేశమంతా ‘వందేమాతరం’ ఉద్యమం ప్రారంభమైంది. బిపిన్ చంద్రపాల్ దేశమంతా పర్యటిస్తూ ఆంధ్రదేశంలో అడుగు పెట్టాడు. ఆ సమయంలో రాజమండ్రి కళాశాలలో చదువుతున్న గాడిచెర్ల ఆ ఉపన్యాసాలతో ప్రభావితుడై విద్యార్థులకు నాయకత్వం వహించారు. తరువాత రోజు కళాశాల విద్యార్థులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి వందేమాతర నినాదాలతో కళాశాలకు వచ్చారు. అక్కడి ప్రిన్సిపల్ హంటర్ బ్యాడ్జీలు తీసివేస్తే తప్ప లోపలికి అడుగు పెట్టనీయ నన్నాడు. కానీ గాడిచెర్లనాయకత్వంలో విద్యార్థులు దానిని నిరాకరిస్తూ ప్రదర్శన జరిపారు. దానితో ప్రిస్టలు గాడిచెర్లను కళాశాలనుండి బహిష్కరించాడు. అంతేగాక ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
గాడిచెర్లవారు ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకునిగా చేరారు. పత్రికారంగంలో ఎడిటర్, ఎడిటోరియల్ అనే ఆంగ్లపదాలకు తొలిసారిగా సంపాదకుడు, సంపాదకీయం అనే పేర్లను పెట్టింది వీరే. స్వరాజ్య పత్రికలో చేస్తున్న సమయంలోనే బ్రిటిష్ అధికారి ‘ఏష్’ హత్య జరిగింది. దాంతో సామాన్య ప్రజలపై బ్రిటిష్ సైనికుల నిర్బంధం, దమనకాండ, తీవ్రతరం అయింది.
దానిని ఎండగట్టుతూ, గాడిచెర్లవారు ‘విపరీతబుద్ధి’ అనే పేరుతో సంపాదకీయం వ్రాశారు. దాంతో ప్రభుత్వం అతనిని రాజద్రోహం నేరం క్రింద అరెస్టు చేసి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలా ఖైదు కాబడిన తొలి రాజకీయ ఖైదీ వీడే రాయవేలూరు జైలులో గాడిచెర్ల వారు అనేక బాధలు అనుభవించారు. కాలికి, మెడకు సంకెళ్ళు వేసి వాటిమధ్య ఒక కొయ్యముక్క తగిలించారు. పురుగుల అన్నం, పడుకోడానికి చినిగిపోయిన చాప, కట్టుకోడానికి రెండు చిన్న బట్ట ముక్కలు మాత్రమే ఇచ్చారు. నూనెగానుగను నిరంతరం తిప్పించేవారు. కానీ ఎన్ని బాధలు పడినా వారిలో పోరాటపటిమ మాత్రం కొంచెం గూడా తగ్గలేదు.
1913లో జైలునుండి విడుదల కాగానే కాశీనాథుని నాగేశ్వరరావుగారి ఆంధ్రపత్రికకు కొంతకాలం సంపాదకునిగా పనిచేసి, 1916లో హోంరూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1920లో గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారివెంట ఆంధ్రదేశమంతా పర్యటించి గాంధీగారి ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషలలో అనర్గళంగా మాట్లాడే వారు. “ది నేషనలిస్ట్” అనే ఆంగ్ల పత్రికను కొంతకాలం నడిపారు. కానీ ప్రభుత్వం దానిని నిషేధించింది. తాడిపత్రిలో ‘మాతృసేవ’ పత్రిక స్థాపనకు కృషి చేశారు. తరువాత సంద్యాలలో ‘కౌమోదకి’ పత్రికను స్థాపించారు.
1927 లో వీరు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం మేరకు మద్రాస్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొని జస్టిస్ పార్టీ అభ్యర్థిని ఓడించి, కర్నూలు నుంచి ఎన్నికైన తొలి యం.యల్.హెచ్.గా గుర్తింపు పొందారు. 1937లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతనాయకుల మధ్య సఖ్యత చేకూర్చి ”శ్రీభాగ్’ ఒప్పందం ఏర్పాటు చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు.
1930 తర్వాత వీరు క్రమక్రమంగా రాజకీయాలకు దూరంగా జరుగుతూ అన్ని గ్రంథాలయ, వయోజనవిద్య ఉద్యమాలకి ఎంతగానో కృషి చేశారు. 1934 నుండి జీవితాంతం వీరు గ్రంథాలయ సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. వయోజన విద్య డైరెక్టరుగా ఆంధ్రదేశమంతా పర్యటిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా మార్చడం కోసం ఎంతగానో కృషి చేశాడు. అనేక గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పడడానికి కారణం అయ్యారు.
గాడిచెర్ల వారు విశ్రాంతి యెరుగని వీరుడు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ, ప్రజల్లోనే గడుపుతూ అనారోగ్యానికి గురై చివరికి 1960 ఫిబ్రవరి 29న దేశమాత సేవలోనే తుదిశ్వాస విడిచారు.





