
సమాజంలోని అన్ని వర్గాల క్రియాశీల భాగస్వామ్యంతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాలను కలుపుకొని వెళితేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కొందరు మనల్ని పరిపాలించారని, దీనికి ప్రధాన కారణం సమాజం వ్యవస్థీకృతంగా లేకపోవడమేనని స్పష్టం చేశారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం మోహన్ భాగవత్ పంజాబ్ లోని లుథియానా వెళ్లారు. ఈ సందర్భంగా అరబిందో కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ ఆడిటోరియంలో ప్రముఖులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నుంచి 800 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంఘ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు, సంఘ వికాసం, క్రమశిక్షణ, కార్య విధానం, దేశ అభివృద్ధిపై ప్రసంగించారు. సమాజాన్ని ఏకం చేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు భారత్ లో నివసించే 1.42 బిలియన్ల మంది ప్రజలందరూ లెక్కలోకి వస్తారన్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవించడం భారతీయ దార్శనికత అని తెలిపారు.
విభిన్న విశ్వాసాలు, వర్గాలు, తెగలకి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అందరిదీ ఒకే గమ్య స్థానమని, కానీ.. మార్గాలు మాత్రం భిన్నభిన్నంగా వుంటాయన్నారు. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు అవలంబిస్తూ, ఇతరుల మార్గాలను మాత్రం గౌరవించాలని నొక్కి చెప్పారు. పంచపరివర్తన్ (సామాజిక సమరసత, పర్యావరణం, స్వదేశీ, కుటుంబ ప్రబోధన్, పౌరవిధులు) అంశాలను మన నిజ జీవితంలో ఆచరంచి చూపాలన్నారు.
ఇక.. పర్యావరణం గురించి మాట్లాడుతూ గాలి గురువు లాంటిదని, నీరు తండ్రి, భూమి తల్లి లాంటిదని గురునానక్ దేవ్ తరుచూ చెప్పేవారని గుర్తు చేశారు.
ఇక.. సంఘ్ అనేది దేశం కోసమే పని చేస్తుందని, వ్యక్తుల స్వార్థం కోసం మాత్రం కానేకాదని తేల్చి చెప్పారు. దీనర్థం దేశం, సమాజం కోసం పనిచేయడం అని అర్థమని, అంతేకానీ సంస్థ కోసమే పనిచేయడం కాదన్నారు.





