News

బక్రీద్‌ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..

6views

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్య చౌహాన్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్..   ఘజియాబాద్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బక్రీద్ పండుగ రోజున సూర్య చౌహాన్‌ను అసద్ దారుణంగా హత్య చేశాడు. అయితే, నగరంలో తలదాచుకున్న అసద్.. తన స్నేహితుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని నగరం విడిచి పారిపోయేందుకు ఖోరా ప్రాంతానికి వెళ్తన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అసద్ మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై వస్తూ పోలీసులకు కనిపించాడు. వారిద్దరిని అడ్డుకుని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, అసద్ ఒక్కసారిగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల మార్పిడిలో అసద్ తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్ర గాయాలపాలైన అసద్‌ను పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ సైతం గాయపడగా, ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసద్ మరణించినట్లు ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు ఉపయోగించిన మోటార్ సైకిల్‌తో పాటు పోలీసులపై కాల్పులు జరిపేందుకు వాడిన నాటు తుపాకీ (కంట్రీ మేడ్ పిస్టల్) ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల కళ్లు గప్పి అసద్‌తో పాటు బైక్‌పై ఉన్న రెండో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) తీవ్రతరం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారిన సూర్య చౌహాన్ హత్య కేసులో ఒక కీలక ఘట్టం ముగిసినట్లయింది.