
ఆలయాల్లో నిత్యం వేలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారని, వీటి తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు ఎంతో కీలకమని నిపుణులు సూచించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన 20 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో ప్రసాదాలు తయారుచేసే సిబ్బందికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర దేవాలయాల పరిపాలన సంస్థ (సీత)లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రసాదం తయారీలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత శిక్షకుడు కె.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ముడి సరుకుల నాణ్యత, పరిశుభ్రమైన నీటి వినియోగం, వంటచేసే పరిసరాల శుభ్రత, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత వంటివాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ప్రసాదం తయారీ సమయంలో గ్లోవ్స్, తలకు క్యాప్స్ ధరించాలన్నారు. కార్యక్రమానికి దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్‌లాల్, సీత డైరెక్టర్ ముక్తేశ్వరరావు, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.





