News

కనకమహాలక్ష్మి ఆలయంలో అపచారం

56views

ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. ఆలయాల పవిత్రతను, సనాతన ధర్మ నియమాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆలయ చైర్మనే నిబంధనలను తుంగలో తొక్కి పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం నూతన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా కందుల నాగరాజు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయన ఆలయంలో ఏకంగా చెప్పులు వేసుకుని తిరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రతి దేవాలయానికి నిర్దిష్ట ఆగమ శాస్త్ర నియమాలు ఉంటాయని, వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిన పాలకమండలి చైర్మనే ఇలా వ్యవహరించడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని భక్తులు, అర్చక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.