News

బంగ్లాదేశీ చొరబాటుదారుల కదలికలకు వ్యతిరేకంగా నిరసన తెెలిపిన హిందూ సంస్థలు

18views

కర్ణాటకలో అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంచారం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశిస్తున్నారనే సమాచారంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుబ్బళ్లి రైల్వే స్టేషన్ వెలుపల శ్రీరామ సేన ఆధ్వర్యంలో హిందూ కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల నుండి రైళ్ల ద్వారా వస్తున్న అనుమానితులపై తక్షణమే నిఘా పెంచాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా భారత దేశంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు, ఆ తర్వాత సురక్షిత ప్రాంతాల కోసం వెతుకుతూ కర్ణాటకకు చేరుకుంటున్నారని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. వీరంతా నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను సృష్టించుకుని ఇక్కడి కాఫీ తోటలు, నిర్మాణ రంగాలు, గృహ కార్మికులుగా స్థిరపడుతున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. రైల్వే పోలీసులు కేవలం పైపైన తనిఖీలు మాత్రమే చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ వ్యవహారం కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో దాదాపు 10 నుండి 20 లక్షల మంది అక్రమ బంగ్లాదేశీయులు నివసిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్. అశోక ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అక్రమ వలసలను చూసీచూడనట్లు వదిలేస్తోందని ఆయన విమర్శించారు.

హిందూ సంస్థల ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక అంతటా రక్షణ సంస్థలు నిఘా ముమ్మరం చేశాయి. హుబ్బళ్లి నుండి బంగ్లాదేశీయులు బస్సుల్లో వస్తున్నారనే సమాచారంతో బెళగావి బస్ స్టాండ్‌లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు బంగ్లాదేశీయులు కాదని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలని తేలింది.

మరోవైపు, బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ద్వారా ప్రవేశించిన 215 మందికి పైగా బంగ్లాదేశీయులను గత కొన్ని నెలలుగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), స్థానిక పోలీసులు బెంగళూరుతో పాటు పలు నగరాల్లో గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ఈ అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి కార్మికుడి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని హిందూ సంస్థలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.