
భారతీయ ముస్లిం యువకులను మతోన్మాదులుగా మార్చి, విదేశీ ఉగ్రవాద సంస్థల వైపు మళ్లించేందుకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. నిషేధిత తాలిబాన్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా జిహాద్‌కు ఉసిగొల్పిన నిందితుడు హమ్రాజ్ వర్షిద్ షేక్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు నిందితుడికి ₹63,000 జరిమానా కూడా విధించారు.
మహారాష్ట్రలోని థానేకు చెందిన నిందితుడు హమ్రాజ్, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది.
సౌదీ అరేబియాలో ఉగ్రబీజాలు
ఎన్‌ఐఏ (NIA) దర్యాప్తు ప్రకారం, హమ్రాజ్ వర్షిద్ షేక్ 2019 నుండి 2022 వరకు సౌదీ అరేబియాలో నివసించాడు. ఆ సమయంలో ఆన్‌లైన్ ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. వారి ప్రభావంతో అతను తాలిబాన్, టీటీపీ సిద్ధాంతాల వైపు పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో “కాశ్మీర్ పేజెస్” (Kashmir Pages) అనే ఖాతాను నిర్వహిస్తున్న “హంజలా” అనే ఆన్‌లైన్ హ్యాండ్లర్ ద్వారా హమ్రాజ్ మరింత మతోన్మాదిగా మారాడు.
భారత్‌లో ఉగ్ర ముఠా ఏర్పాటుకు కుట్ర
సౌదీ అరేబియా నుండి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత హమ్రాజ్ దేశద్రోహ కార్యకలాపాలకు తెరలేపాడు. బెంగళూరులో ఫ్రెంచ్ భాషా అనువాదకుడిగా (Translator) పనిచేస్తున్న మహ్మద్ ఆరిఫ్ అనే మరో నిందితుడితో చేతులు కలిపాడు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియా వేదికగా దేశంలోని సున్నిత మనస్కులైన ముస్లిం యువకులను టార్గెట్ చేశారు.
వారికి తాలిబాన్ హింసాత్మక వీడియోలను చూపిస్తూ, ఇస్లామిక్ పాలన స్థాపన కోసం భారతదేశానికి వ్యతిరేకంగా జిహాద్ (యుద్ధం) ప్రకటించాలని నూరిపోశారు. యువకులను చేర్చుకుని ఒక ఉగ్ర ముఠాను తయారు చేసి, వారిని ఆఫ్ఘనిస్తాన్ పంపి టీటీపీ (TTP) ఉగ్రవాద సంస్థలో చేర్చడమే వీరి ప్రధాన వ్యూహంగా దర్యాప్తులో తేలింది. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయడమే వీరి అంతిమ లక్ష్యం.
ఎన్‌ఐఏ (NIA) రంగప్రవేశం – ఛార్జ్‌షీట్
ఈ ప్రమాదకరమైన కుట్రను పసిగట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఏప్రిల్ 2023లో ఐపీసీ (IPC) మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పక్కా ఆధారాలతో అక్టోబర్ 2023లో హమ్రాజ్ షేక్, మహ్మద్ ఆరిఫ్‌లపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడు హమ్రాజ్ నేరాన్ని ఒప్పుకోవడంతో ప్రత్యేక కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న మహ్మద్ ఆరిఫ్‌పై విచారణ ఇంకా ముగియలేదు. అతనిపై బెంగళూరు ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన ఆన్‌లైన్ ఉగ్రవాద ప్రచారాలపై ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక అని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్గనైజర్ సౌజన్యంతో





