News

మల్లన్న దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ

111views

శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మునుపెన్నడూ లేని విధంగా చుక్కెదురైంది. భక్తుల రద్దీని అంచనా వేయలేకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పాదయాత్రగా వస్తున్న భక్తులు ఒక వైపు, వాహనాల్లో వచ్చే భక్తుల రద్దీతో శ్రీగిరి కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అన్ని సవ్యంగా ఉన్నాయని భావించినా, డొల్లతనం బయటపడింది. జ్యోతిర్ముడితో వచ్చిన శివదీక్షా భక్తులకు, సాధారణ భక్తులకు దర్శనాలు చేయించలేక ఆలయ యంత్రాంగం వైఫల్యం చెందడం భక్తులను నివ్వెర పరిచింది.

దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ
ఉదయం నుంచి రూ.200, రూ.500 టికెట్ల భక్తులతో పాటు ఉచిత దర్శనం భక్తులతో ఆలయ క్యూ కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో వచ్చిన సాధారణ, శివదీక్షా భక్తులు శ్రీకృష్ణదేవరాయ గోపురం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. కానీ గంటల తరబడి నిరీక్షించాక.. శివ మాలధారులు మాత్రమే ఆలయం లోపలికి వెళ్లడం, సాధారణ భక్తులను నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. చివరకు సాధారణ, శివ స్వాములతో ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద క్యూలైన్లలో ఇరుక్కుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి వచ్చే పరిస్థితి లేక భక్తులు నరకం అనుభవించారు. మరోవైపు ఉచిత, రూ.200 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శౌచాలయానికి గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. చాలా మంది ఆహారం లేక అలమటించారు. కొందరు భక్తులు కంపార్ట్‌మెంట్‌ సందుల నుంచి గోడలు ఎక్కి కృష్ణదేవరాయగోపురం గేటు నుంచి బయటకు వచ్చారు.

క్యూలైన్లు విరగ్గొట్టిన భక్తులు
బ్రహ్మోత్సవాల రెండో రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి సాధారణ, శివదీక్షా భక్తులను విడతల వారీగా దర్శనాలకు అనుమతించారు. ఉదయం 9.30 గంటల వరకు దర్శనాలు సజావుగా జరిగినా, ఆ తర్వాత అదుపు చేయలేని పరిస్థితికి చేరుకుంది. చంద్రావతి కల్యాణమండపం నుంచి దర్శనానికి వచ్చే జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించలేక అసహనానికి గురయ్యారు. క్యూలైన్ల మెష్‌లకు సందులు చేసి ఒక వైపు, గేట్లు ఎక్కి మరోవైపు ఆలయ తూర్పున ఉన్న కృష్ణదేవరాయగోపురం నుంచి తండోపతండాలుగా వచ్చారు. ప్రధాన ద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు దూసుకొచ్చారు. వారిని అదుపు చేయడానికి పోలీస్, దేవస్థానం అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఒప్పంద సిబ్బంది ఉన్నప్పటికీ పరిస్థితి చేయిదాటి పోతోందని కొందరు దేవస్థానం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.